1961 ఐటీ చట్టానికి గుడ్‌బై.. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి కొత్త ఆదాయపు పన్ను చట్టం..
భారతదేశంలో ఆదాయపు పన్ను వ్యవస్థలో కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. కేంద్ర ఆదాయపు పన్ను శాఖ ఈ ఏడాది మార్చి నెల మొదటి వారంలో కొత్త ఆదాయపు పన్ను నియమాలు (Income Tax Rules 2026)తో పాటు పన్ను సంబంధిత ఫారాలను అధికారికంగా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ చర్యలు 60 ఏళ్లుగా అమల్లో ఉన్న 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని భర్తీ చేస్తూ తీసుకువచ్చే కొత్త Income Tax Act, 2025 అమలుకు ముందస్తు సిద్ధతగా భావించవచ్చు. ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది.
పన్ను చట్టాలను సులభతరం చేయడం, భాషను సరళంగా మార్చడం, అలాగే డిజిటల్ ఆధారిత విధానాల ద్వారా పన్ను చెల్లింపుదారులకు మరింత సౌకర్యవంతమైన వ్యవస్థను అందించడం లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. అందులో భాగంగా కొత్త నియమాలు, ఫారాలు ముందుగానే ప్రకటించి, పన్ను చెల్లింపుదారులకు మార్పులకు అలవాటు పడే అవకాశం కల్పిస్తున్నారు.

కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత.. Assessment Year 2027-28కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్లు 2027 జూలై నెలలో ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే దానికి ముందే ప్రారంభమయ్యే FY 2026-27 నుంచి కొన్ని పన్ను సంబంధిత ప్రక్రియలు కొత్త నియమాల ప్రకారం అమలవుతాయి. ముఖ్యంగా ముందస్తు పన్ను (Advance Tax), మూలం వద్ద పన్ను కట్టడం (TDS), ఇతర అనుబంధ ఫారాలు ఏప్రిల్ 1, 2026 నుంచే వర్తిస్తాయి.
ఈ కొత్త నియమాల్లో ఉద్యోగులకు సంబంధించిన పర్‌క్యుయిజిట్స్ (Perquisites) అంశంలో కూడా మార్పులు ఉండనున్నాయి. కంపెనీ కార్ల వినియోగం, ఇతర సౌకర్యాలు వంటి ఉద్యోగి ప్రయోజనాలపై విధించే పన్ను విలువలను తిరిగి నిర్వచించే అవకాశం ఉంది. ఈ మార్పులు పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం రెండింటికీ వర్తించేలా రూపొందిస్తున్నారు.
మరొక ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. పన్ను రిటర్న్ ఫైలింగ్ పూర్తిగా టెక్నాలజీ ఆధారితంగా మారనుంది. కొత్త సిస్టమ్‌లో ఆటో-పాప్‌లేటెడ్ డేటా కీలక పాత్ర పోషిస్తుంది. ఉద్యోగుల జీతాలు, వడ్డీ ఆదాయం, డిడక్షన్లు, ఇతర ఆదాయ వివరాలు ముందుగానే ఫారాల్లో కనిపిస్తాయి. దీని వల్ల తప్పుల అవకాశాలు తగ్గి, పన్ను రిటర్న్ దాఖలు ప్రక్రియ వేగవంతమవుతుంది.
ఈ నియమాల రూపకల్పనలో భాగంగా ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ (Public Consultation) కూడా చేపట్టింది. డ్రాఫ్ట్ నియమాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచి.. ఫిబ్రవరి 22, 2026 వరకు నిపుణులు, పన్ను సలహాదారులు, సాధారణ పన్ను చెల్లింపుదారుల నుంచి సూచనలు స్వీకరిస్తున్నారు. వచ్చిన అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత అవసరమైన సవరణలు చేసి తుది నియమాలు ప్రకటిస్తారు.
ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయపు పన్ను రిటర్న్ ఫారాలు FY 2025-26 వరకు యథావిధిగా కొనసాగుతాయి. అందువల్ల మార్పు ప్రారంభ దశలో పన్ను చెల్లింపుదారులకు గందరగోళం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత క్రమంగా కొత్త ఫారాలు పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి వస్తాయి.


Click it and Unblock the Notifications