Jobs: ఇంజనీరింగ్, ఐటీ వద్దు..! ఇప్పుడు ఈ ఉద్యోగాలకే భారీ డిమాండ్.. లక్షల్లో జీతాలు!
దశాబ్దాలుగా భారతదేశంలో సక్సెస్ అంటే రెండే రెండు అక్షరాలు.. ఐటీ. ఇంజనీరింగ్ పూర్తి చేయడం, ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో కోడింగ్ జాబ్ సంపాదించడం అనేది ఒక తరం కల. కానీ, 2026 నాటికి ఈ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు సురక్షితం అనుకున్న టెక్ ఉద్యోగాల్లో లేఆఫ్స్ (Layoffs) పెరగడం, కృత్రిమ మేధ (AI) రాకతో 40 ఏళ్ల వయసున్న నిపుణులు కూడా తమ నైపుణ్యాలు పనికిరావేమోనన్న ఆందోళనలో పడ్డారు. ఈ క్రమంలోనే భారతీయుల చూపు ఇప్పుడు టెక్నాలజీకి అతీతంగా కొత్త కెరీర్ల వైపు మళ్లుతోంది.

హెల్త్‌కేర్: కొత్త 'గోల్డ్ స్టాండర్డ్' కెరీర్
2026 లో భారతదేశంలో అత్యుత్తమ ఉద్యోగాల (best jobs) జాబితాలో హెల్త్‌కేర్ రంగం అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా డెర్మటాలజిస్టులకు (చర్మ వ్యాధి నిపుణులు) డిమాండ్ అమాంతం పెరిగింది. వీరి నియామకాలు ఏకంగా 182 శాతం వృద్ధి చెందాయి. మధ్యతరగతి ప్రజలు తమ ఆరోగ్యం, బాహ్య సౌందర్యం (Lifestyle treatments) కోసం ఖర్చు చేయడానికి వెనుకాడకపోవడమే దీనికి ప్రధాన కారణం. సర్జన్లు, మెడికల్ ఆఫీసర్ల అవసరం కూడా మెట్రో నగరాల నుంచి టైర్-2 పట్టణాల వరకు విస్తరించింది.
రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పుంజుకుంది
భారతదేశం వేగంగా పట్టణీకరణ చెందుతుండటంతో సివిల్ ఇంజనీర్లు, సీనియర్ ఆర్కిటెక్ట్లు, రియల్ ఎస్టేట్ నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడింది. హైవేలు, మెట్రో కారిడార్లు, అత్యాధునిక హౌసింగ్ క్లస్టర్ల నిర్మాణం కోసం అనుభవజ్ఞులైన నిపుణుల అవసరం పెరిగింది. గతంలో కేవలం డిగ్రీ ఉంటే సరిపోయేది. కానీ, ఇప్పుడు 'అకౌంటబిలిటీ' (జవాబుదారీతనం), ప్రాజెక్ట్ డెలివరీలో ఖచ్చితత్వం ఉన్నవారికే కంపెనీలు భారీ జీతాలు ఆఫర్ చేస్తున్నాయి.
నాయకత్వ పాత్రలే అసలైన 'పవర్ జాబ్స్'
కంపెనీలు కేవలం మనుగడ కోసం కాకుండా, పక్కా ప్లానింగ్‌తో వృద్ధి చెందాలని చూస్తున్నాయి. అందుకే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO), హెడ్ ఆఫ్ సేల్స్, మార్కెటింగ్ హెడ్ వంటి లీడర్‌షిప్ రోల్స్ కోసం వేట పెరిగింది. క్లిష్ట పరిస్థితుల్లో టీమ్‌ను నడిపించగల సామర్థ్యం, ఖర్చులను నియంత్రించగల నైపుణ్యం ఉన్నవారికి 100 శాతానికి పైగా హైరింగ్ గ్రోత్ కనిపిస్తోంది. టెక్నాలజీ రంగంలో కూడా పైథాన్ డెవలపర్ వంటి పాత్రలు ఉన్నప్పటికీ, అవి ఇప్పుడు ఇతర రంగాలతో పోటీ పడాల్సి వస్తోంది.
క్రియేటివిటీకి పెరిగిన విలువ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేని పనులకే ఇప్పుడు ఎక్కువ విలువ దక్కుతోంది. ఇంటీరియర్ డిజైనర్లు, సోషల్ మీడియా మేనేజర్లు, ట్రావెల్ కన్సల్టెంట్లు వంటి క్రియేటివ్, కస్టమర్-ఫేసింగ్ ఉద్యోగాలకు ఆదరణ పెరుగుతోంది. భారతీయులు తమ అనుభవాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తుండటమే దీనికి కారణం.
నైపుణ్యానికే పట్టం
"రాబోయే దశాబ్దంలో కేవలం డిగ్రీలు చూసి ఉద్యోగాలు రావు, మీరు చేసే పనిలో ఎంత లోతు (Depth) ఉంది అనేదే ముఖ్యం" అని కెరీర్ నిపుణుడు ఆశిష్ కుమార్ పేర్కొన్నారు. అందరూ వెళ్లే కోర్సుల వెనుక పడకుండా, సమాజానికి దీర్ఘకాలికంగా అవసరమైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల వంటి రంగాల్లో నైపుణ్యం పెంచుకుంటే కెరీర్ స్థిరంగా ఉంటుంది. 2026లో విజయం అంటే కేవలం కోడింగ్ మాత్రమే కాదు, నిజమైన సమస్యలను పరిష్కరించగల బాధ్యతాయుతమైన వృత్తి అని భారతీయులు గుర్తిస్తున్నారు.


Click it and Unblock the Notifications