అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ మాట మార్చారు. రష్యా చమురుపై 100% సుంకాల బెదిరింపుని అమెరికా మాజీ అధ్యక్షుడు వెనక్కి తీసుకున్నారు. రష్యా చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలపై 100 శాతం ద్వితీయ సుంకాలు విధిస్తామని జూలైలో హెచ్చరికలు చేసిన సంగతి విదితమే. తాజాగా దీనిపై యూటర్న్ తీసుకున్నారు. ఆగస్టు 5న వైట్ హౌస్‌లో విలేకరులతో జరిగిన సమావేశంలో మాడ్లాడుతూ.. తాను ఎప్పుడూ శాతం గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు.
అదనపు సుంకాల విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. రేపు రష్యాతో సమావేశం ఉంది, అందులో ఏమి జరుగుతుందో చూద్దామని ఆయన అన్నారు. కాగా గత నెలలో ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా చమురును కొనుగోలు చేస్తే భారత్ సహా అన్ని దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అంతేకాక 50 రోజుల్లోపు మాస్కో ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి సిద్ధమవ్వాలని అలా కాని పక్షంలో అదనపు సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. సెప్టెంబర్ ప్రారంభం నాటికి ఈ గడువు ముగియనుంది.అయితే ఇప్పుడు ఈ మాటలను వెనక్కి తీసుకున్నారు. దీని వెనుక సున్నితమైన దౌత్యపరమైన వ్యూహం ఉందని అమెరికా రాజకీయ వర్గాలు అంటున్నాయి.

గత వారం భారత్ మాకు మంచి వాణిజ్య భాగస్వామి కాదని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారు మాతో వ్యాపారం చేస్తున్నారు కానీ మేము వారితో చేయడం లేదు. రష్యా చమురును కొనుగోలు చేయడం ద్వారా వారు యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నారు. అందుకే ఇండియాపై 25 శాతం సుంకాన్ని భారీగా పెంచాలనుకుంటున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు.అదే సమయంలో చైనాకు మాత్రం 90 రోజుల సుంకాల సడలింపు ఇస్తున్నామనే ప్రకటనపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి.
ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికా ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి నిక్కీ హేలీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్ ఒక బలమైన వ్యూహాత్మక మిత్రుడు. చైనాకు ఇలాంటి సడలింపులు ఇస్తూ, భారత్‌ను బెదిరించడం అమెరికా హేతుబద్ధ దౌత్యానికి భంగం కలిగిస్తుందన్నారు. భారత్‌తో సంబంధాలను కాల్చుకోవద్దు..సమతుల్య దౌత్యమే అవసరమని నొక్కి చెప్పారు. అయితే ట్రంప్ తాజా వ్యాఖ్యల ప్రకారం చూసుకున్నట్లయితే 25 శాతం నిర్ణయం ఇంకా ఖరారు కాలేదు.రష్యాతో సమావేశం అనంతరం అమెరికా దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
జనవరి 2022 నుండి ఇప్పటివరకు, అమెరికా $24.51 బిలియన్ల విలువైన రష్యన్ వస్తువులను దిగుమతి చేసుకున్నదని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024లో మాత్రమే.. $1.27 బిలియన్ల విలువైన ఎరువులు, $624 మిలియన్ల విలువైన యురేనియం, ప్లూటోనియం, $878 మిలియన్ల విలువైన పల్లాడియం వంటి కీలక వస్తువులు రష్యా నుంచి దిగుమతి అయ్యాయి.ఇవన్నీ అణుశక్తి, ఎలక్ట్రానిక్స్, రసాయన పరిశ్రమలకు కీలకమైనవి.


Click it and Unblock the Notifications