1.5 లక్షల మంది ఉద్యోగులకు విప్రో శుభవార్త, డిసెంబర్ 1 నుండి శాలరీ పెంపు
భారత ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు డిసెంబర్ 1వ తేదీ నుండి తన ఉద్యోగులకు వేతనాలు పెంచనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా వివిధ వ్యాపారాలు నష్టపోయాయి. అయితే ఐటీ కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులకు వేతన పెంపును అమలు చేస్తున్నాయి. సంస్థలో 80 శాతం మంది ఉద్యోగులకు డిసెంబర్ ఒకటో తేదీ నుండి వేతనాలను పెంచనుంది.

వారి శాలరీ పెంపుపై నిర్ణయం తీసుకోలేదు
B3, దిగువస్ధాయి సిబ్బందికి శాలరీ పెంచాలని విప్రో నిర్ణయించింది. వీరికి సింగిల్ డిజిట్ సగటు వేతన పెంపును నిర్ణయించింది. అయితే సీనియర్ ఉద్యోగుల వేతనాల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విప్రోలో 1.85 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వేతన పెంపుతో దాదాపు 1.5 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. గతంలో మాదిరిగా మంచి సామర్థ్యం కనబరిచినవారికి ఇంక్రిమెంట్లు అందిస్తున్నామని కంపెనీ వర్గాలు చెప్పాయి.

వేతనాల పెంపు వాయిదా
కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ప్రారంభంలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో సహా వివిధ ఐటీ సంస్థలు ఉద్యోగులకు వేతనాల పెంపును వాయిదా వేశాయి. కరోనా లాక్ డౌన్ వల్ల కార్యకలాపాలు నిలిచిపోవడంతో, బిజినెస్ లేక దాదాపు అన్ని రంగాల్లో వాయిదా పడింది. కొన్ని కంపెనీలు ఈసారికి వేతనాల పెంపును ఆపేశాయి. తాజాగా ఐటీ కంపెనీల ఫలితాలు బాగుంటున్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి వేతన పెంపును అమలు చేస్తున్నాయి. మంచి ప్రదర్శన కనబరిచినవారికి వేతనాలు పెంచుతున్నట్లు సంస్థలు ప్రకటించాయి.

క్లిష్ట సమయంలో ఉద్యోగుల పనితీరు బాగుంది
సవాళ్లతో కూడిన క్లిష్ట సమయంలో తమ ఉద్యోగులు నిరంతరాయంగా వ్యాపారాన్ని కొనసాగేలా చూడటంతోపాటు నాణ్యమైన సేవల్ని కొనసాగించారని విప్రో ప్రతినిధులు చెబుతున్నారు. మిడిల్, సీనియర్ శ్రేణిలో కీలక నైపుణ్యాల్ని కాపాడుకునేందుకు కంపెనీ పలు చర్యలు చేపడుతుందన్నారు. టీసీఎస్ అక్టోబర్ 1 నుంచి వర్తించేలా వేతన పెంపును ప్రకటించింది. జనవరి నుంచి ఉద్యోగులందరికీ వేతన పెంపును చేపడతామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. మెరుగైన సామర్ధ్యం కనబరిచినందుకు ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రత్యేక ప్రోత్సాహకం అందచేస్తామన్నారు.


Click it and Unblock the Notifications