హైదరాబాద్: అమెరికాకు చెందిన మెడికల్ పరికరాల దిగ్గజం మెడ్‌ట్రానిక్ తెలంగాణలో రూ.1,200 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని ఆర్థిక జిల్లాలోని పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని (ఆర్ అండ్ డీ) విస్తరించి, భారీ ఇంజినీరింగ్, ఆవిష్కరణల కేంద్రంగా రూపొందించనుంది. దీని ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. మెడ్‌ట్రానిక్ అమెరికా తర్వాత ప్రపంచంలో ఏర్పాటు చేస్తున్న రెండో కేంద్రం ఇదే కావడం గమనార్హం.

5వేల ఉద్యోగాలు.. ప్రపంచంలో రెండో అతిపెద్ద కేంద్రం
హైదరాబాద్‌లోని మెడ్‌ట్రానిక్ ఆర్ అండ్ డీ కేంద్రం విస్తరణ ద్వారా ప్రారంభంలో వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆ తర్వాత క్రమంగా 5వేలకు చేరుకుంటుంది. కరోనా సమయంలో హైదరాబాద్‌లో ఇది భారీ పెట్టుబడి. హైదరాబాద్ మెడికల్ హబ్ అని తెలిసిందే. ఇప్పుడు వైద్య పరికరాల కేంద్రంగా (మెడికల్ డివైసెస్ హబ్) మారనుంది. మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మెడ్‌ట్రానిక్ కంపెనీ హైదరాబాద్ నగరాన్ని రెండో అతిపెద్ద ఆర్ అండ్ బీ కేంద్రంగా ఎంచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడితో ఉద్యోగాలు వస్తాయన్నారు. మంగళవారం కంపెనీ ప్రతినిధులతో వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్నారు కేటీఆర్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార ధోరణుల్ని పరిశీలించినప్పుడు భారత్‌కు ఈ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు.

రెండు మూడేళ్లుగా చర్చలు
హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్‌తో మెడ్ టెక్ హబ్‌గా మారనుంది తెలంగాణ. మెడ్‌ట్రానిక్ కంపెనీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఈ ప్రాజెక్టుపై రెండుమూడేళ్లుగా చర్చలు జరుపుతున్నాయి. ఈ పెట్టుబడి భారతదేశంపట్ల తమ చిత్తశుద్ధికి నిదర్శనమని మెడ్‌ట్రానిక్ పేర్కొంది. ఫార్మా, ఐటీ హబ్‌గా ఉన్న హైదరాబాద్ దీంతో మెడికల్ పరికరాల హబ్‌గా మారనుంది.

140 దేశాల్లో వ్యాపారం.. లక్షమంది ఉద్యోగులు
మెడ్‌ట్రానిక్ అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వంద దేశాల్లో ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షమందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. 2019-20లో 30 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2016లో అమెరికాలో పర్యటించిన సందర్భంగా కేటీఆర్ మెడ్‌ట్రానిక్ చైర్మన్ ఒమర్ ఇస్రాక్‌తో సమావేశమయ్యారు. పెట్టుబడులపై చర్చించారు. 1949లో దీనిని స్థాపించారు. ప్రపంచ మెడికల్ రంగంలో తనదైన ముద్ర వేసింది. కరోనా నేపథ్యంలో ఇటీవల ఈ కంపెనీ పోర్టబుల్ వెంటిలెటర్‌ను తీసుకు వచ్చింది.


Click it and Unblock the Notifications