భారత్ లో కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పెరుగుతున్న జీవన ప్రమాణాల కారణంగా మధ్యతరగతి ప్రజలూ విలాసాలపై దృష్టి సారిస్తున్నారు. కరోనా అనంతరం సొంత వాహనాలకు జైకొట్టే వారి సంఖ్య క్రమంగా పెరిగుతోంది. వీటికి తోడు తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వేతన జీవులకు పన్ను మినహాయింపు ఇవ్వడంతో.. ఈసారి మరింత వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నారు.ఇటీవల విడుదలైన డేటా సైతం ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది.

మొదటి స్థానంలో మారుతీ సుజికీ:
గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి జనవరి వరకు మొత్తం 31 లక్షల 69 వేల 788 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయినట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(SIAM) నివేదించింది. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో 24 లక్షల 3 వేల వాహనాలు మాత్రమే విక్రయించినట్లు పేర్కొంది. అత్యధికంగా మారుతీ సుజికీ ఇండియా వాహనాలు అమ్ముడు కాగా.. తర్వాతి స్థానంలో హ్యుండాయ్ మోటార్ నిలిచిందని తెలిపింది.

పది నెలల్లో 9 లక్షలకు పైగా..
ఈ ఏడాది జనవరిలో మారుతీ సుజుకీ లక్షకు పైగా ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య 9 లక్షలకు పైగా పీవీలను అమ్మింది. ఇక హ్యుండాయ్ మోటార్ ఇండియా విషయానికి వస్తే.. జనవరి 2023లో 22,574 మరియు ఏప్రిల్-జనవరి మధ్య 2 లక్షలకు పైగా ప్యాసింజర్ వెహికల్ విక్రయాలు సాధించింది. మొత్తంగా 2022 జనవరిలో 2.5 లక్షల ప్యాసింజర్ వాహనాలు తయారుచేస్తే.. ఈ ఏడాది అదే నెలలో దాదాపు 3 లక్షలు ఉత్పత్తి చేయబడ్డాయి.

రెనాల్డ్ క్విడ్ సైతం..
మారుతీ సుజుకీ ఆల్టో, ఎస్-ప్రెస్సో మోడళ్లపై వినియోగదారులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు డేటా వెల్లడించింది. ఒక్క 2023 జనవరిలోనే ఈ మోడళ్ల ప్యాసింజర్ వాహనాలు 25,446 విక్రయించబడ్డాయని పేర్కొంది. అదే గత ఏప్రిల్-జనవరి మధ్య సుమారు 2 లక్షల యూనిట్లు అమ్ముడయినట్లు తెలిపింది. ఈ ఏడాది జనవరిలో రెనాల్ట్ క్విడ్ అమ్మకాలు సైతం బాగున్నట్లు చెప్పింది. గత నెలలో 59 యూనిట్లు, 10 నెలల్లో 16,457 వాహనాలు విక్రయించినట్లు ప్రకటించింది.

వృద్థికి బడ్జెట్ ఊతం:
"గత 10 నెలలతో పోల్చి చూస్తే జనవరిలో అత్యధికంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు జరిగాయి. తద్వారా మొదటిసారిగా 3 మిలియన్ల మార్కును సాధించాయి. ఈసారి బడ్జెట్ లోని సానుకూల ప్రకటనల వల్ల వృద్ధి ఊపందుకోనుంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించడం ద్వారా ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉంటుంది. తద్వారా వినియోగం పెరిగి మరింత డిమాండ్ ఏర్పడుతుంది" అని SIAM ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. ఆటో మొబైల్ రంగంపై తాజా బడ్జెట్ సానుకూల ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications