భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: 400 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.17 సమయానికి నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో, సెన్సెక్స్ 182 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. 314 షేర్లు లాభాల్లో, 448 షేర్లు నష్టాల్లో ఉండగా, 53 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. సెన్సెక్స్ ఆ తర్వాత మధ్యాహ్నం గం.12.33 సమయానికి 157.09 (0.38%) పాయింట్లు కోల్పోయి 41,456.10 వద్ద, నిఫ్టీ 45.85 (0.37%) పాయింట్లు నష్టపోయి 12,202.40 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం గం.2.48 సమయానికి సెన్సెక్స్ 407.74 (0.98%) పాయింట్లు నష్టపోయి 41,205.45 వద్ద, నిఫ్టీ 120.05 (0.98%) పాయింట్లు కోల్పోయి 12,128.20 వద్ద ట్రేడ్ అయింది. సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 458 పాయింట్లు కోల్పోయి 41,155 పాయింట్ల వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయి 12,119 వద్ద ముగిసింది.
డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.15 వద్ద ట్రేడ్ అయింది. చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనతో మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీస్తోంది. కరోనా వైరస్ కారణంగా 80 మంది వరకు మృతి చెందారని, ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 2,000కు చేరుకుందని, ఈ వైరస్ మరింతగా బలపడుతోందని చైనా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ వైరస్ క్రమంగా ఇతర దేశాలకు కూడా విస్తరిస్తోంది. దీంతో పాటు ఇరాక్‌లోని రాయబార కార్యాలయంపై దాడి వంటి పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.
మధ్యాహ్నం సమయానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకు, అల్ట్రా టెక్ సిమెంట్, మారుతీ సుజుకీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హిండాల్కో, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి. రంగాల వారీగా చూస్తే ఫార్మా రంగం ఒక్కటే లాభాల్లో ట్రేడ్ అవుతోంది.మెటల్, బ్యాంకు, ఎనర్జీ, ఇన్ఫ్రా, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.


Click it and Unblock the Notifications