ఉద్యోగుల 3 నెలల నోటీస్ పిరియడ్ పై రచ్చ రచ్చ.. అమెరికా 2 వారాలు, చైనా 30 రోజులు… భారత్‌లో 90 రోజులు ఎందుకు?
ఇండియా కార్పొరేట్ రంగంలో అమలులో ఉన్న 90 రోజుల నోటీసు వ్యవధిపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ప్రముఖ అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థలో పనిచేస్తున్న ఒక మేనేజర్, అనేక భారతీయ కంపెనీలు అమలు చేస్తున్న ఈ విధానాన్ని అసమర్థమైనది, విషపూరితమైనది అంటూ తీవ్రంగా విమర్శించారు. నిపుణుల కోసం ఉపయోగించే అనామక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ గ్రేప్‌వైన్ (Grapevine)లో ఆయన షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
తాను ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ టీమ్‌కు మేనేజర్‌గా ఉన్నానని పేర్కొన్న ఆయన.. కొత్త ఉద్యోగులను నియమించుకోవడం తనకు ఒక భయంకరమైన అనుభవంగా మారిందని చెప్పుకొచ్చారు. దీనికి కారణం ఒక్కటే.. అభ్యర్థులందరికీ ఉన్న మూడు నెలల నోటీసు పీరియడ్. మంచి ప్రతిభ ఉన్న ఉద్యోగిని ఎంపిక చేసినా, వారు వెంటనే లేదా 15-30 రోజుల్లో చేరలేని పరిస్థితి ఉండటం వల్ల నియామక ప్రక్రియ పూర్తిగా దెబ్బతింటోందని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన ఇతర దేశాల నిబంధనలతో పోలిక తీసుకొచ్చారు. అమెరికాలో ఉద్యోగం మారాలంటే సాధారణంగా రెండు వారాల నోటీసు సరిపోతుందని, చైనాలో అయితే చట్టపరంగా గరిష్టంగా 30 రోజులు మాత్రమే నోటీసు ఇవ్వాలని చెప్పారు. కానీ భారతదేశంలో మాత్రం ఉద్యోగులను పావు సంవత్సరం పాటు బంధించినట్టుగా ఉంచుతున్నారని మండిపడ్డారు. అమెరికాలో రెండు వారాలు.. చైనాలో 30 రోజులు.. కానీ భారతదేశంలో మాత్రం 90 రోజులు. ఇది చాలా దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.
మేనేజర్ అభిప్రాయం ప్రకారం.. ఈ విధానం పాతదే కాకుండా అనేక సమస్యలకు మూలంగా తెలిపారు. ఒకవైపు కంపెనీల HR విభాగాలు తక్షణమే జాయిన్ అవ్వాలని కోరుకుంటాయి. మరోవైపు ఉద్యోగి రాజీనామా చేస్తే మాత్రం ఒప్పందం చూపించి 90 రోజులు తప్పనిసరి అంటాయి. ఈ ద్వంద్వ వైఖరి పూర్తిగా అన్యాయమని ఆయన విమర్శించారు. ఇంకో ముఖ్యమైన సమస్య ఏమిటంటే.. ఉద్యోగి ఒక ఆఫర్‌ను అంగీకరించిన తర్వాత కూడా ఈ మూడు నెలల సమయంలో మరిన్ని ఆఫర్‌ల కోసం వెతకడం చాలా ఇబ్బందికర సమస్యగా చెప్పుకొచ్చాడు.
ఒక అభ్యర్థి మొదటి రోజే ఆఫర్ అంగీకరిస్తాడు. కానీ తరువాతి 89 రోజులు మరో మంచి ఆఫర్ కోసం చూస్తుంటాడు. చివరి వారంలో ఎవరో 30 శాతం ఎక్కువ జీతం ఇస్తే.. మొదటి ఆఫర్‌ను వదిలేస్తాడు. నిజంగా చూస్తే.. ఈ పరిస్థితికి ఉద్యోగిని నిందించలేం. వ్యవస్థే ఇలా తయారుచేసిందని ఆయన రాశారు. 90 రోజుల నోటీసు కాలం ఉద్యోగిని మాత్రమే కాదు, సంస్థను కూడా నష్టపరుస్తుందని మేనేజర్ తెలిపారు. రాజీనామా చేసిన ఉద్యోగి చాలాసార్లు మానసికంగా ఇప్పటికే ఉద్యోగం వదిలేసిన స్థితిలో ఉంటాడు. రోజూ లాగిన్ అవుతాడు కానీ కనీస పని మాత్రమే చేస్తాడని చెప్పుకొచ్చారు.
ఇది సజావుగా బాధ్యతలు అప్పగించడం కాదు. ఇది మూడు నెలల డెడ్ వెయిట్ అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఏదేమేనా ఈ విధానం ఉద్యోగికి సంస్థకు రెండింటికీ నష్టమేనని, భారతీయ కంపెనీలు నోటీసు పీరియడ్ సంస్కరణలపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంగా అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications