ట్రంప్‌కు బిగ్ షాక్.. లక్ష డాలర్ల H-1B వీసా ఫీజును రద్దు చేసిన ఫెడరల్ కోర్టు..
అమెరికాలో ఐటీ సహా పలు రంగాల్లోని అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులపై (ముఖ్యంగా భారతీయులపై) తీవ్ర ప్రభావం చూపుతున్న ఒక వివాదాస్పద నిర్ణయానికి అక్కడి ఫెడరల్ కోర్టు బ్రేక్ వేసింది. కొత్త హెచ్-1బి (H-1B) వీసాల జారీ ప్రక్రియపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 1 లక్ష డాలర్ల (సుమారు రూ. 83 లక్షలకు పైగా) భారీ రుసుమును బోస్టన్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ సోమవారం కొట్టివేశారు. అమెరికా పార్లమెంట్ (కాంగ్రెస్) ఎన్నడూ ఆమోదించని ఈ రుసుము పూర్తిగా చట్టవిరుద్ధమైన పన్ను (Illegal Tax) అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.
వలస చట్టాల ప్రకారం.. కొంతమంది విదేశీ పౌరుల అమెరికా ప్రవేశం దేశ ప్రయోజనాలకు హానికరం అని భావించినప్పుడు వారిని నియంత్రించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని, ఆ నిబంధన కింద విధించిన చట్టబద్ధమైన ద్రవ్య జరిమానానే ఈ రుసుము అని ట్రంప్ ప్రభుత్వం కోర్టులో గట్టిగా వాదించింది. అయితే, ఈ వాదనను తోసిపుచ్చిన న్యాయమూర్తి సోరోకిన్.. ఆ లక్ష డాలర్ల వసూలు విధానం , దాని సారాంశాన్ని బట్టి చూస్తే అది స్పష్టంగా ఒక పన్ను అని తేల్చారు.

రిపబ్లికన్ అధ్యక్షుడికి సొంతంగా పన్నులు విధించే అధికారాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని, అందువల్ల దీనిని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ లేదా ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అమలు చేయలేవని స్పష్టం చేశారు. జాతీయ అత్యవసర పరిస్థితుల చట్టం కింద ట్రంప్ విధించిన భారీ సుంకాలను కొట్టివేస్తూ యూఎస్ సుప్రీంకోర్టు గత ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ.. వలస చట్టాల చాటున పన్నులు వసూలు చేసే అధికారం ట్రంప్‌కు లేదని న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
ఈ తీర్పుపై వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ స్పందిస్తూ.. అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించే విదేశీయుల ప్రవేశాన్ని పరిమితం చేయడానికి అధ్యక్షుడు ట్రంప్‌కు స్పష్టమైన చట్టపరమైన హక్కులు ఉన్నాయని, ఈ తీర్పుపై తాము ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌కు వెళ్తామని, అక్కడ తమకు అనుకూలమైన నిర్ణయం వస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. గత సెప్టెంబర్‌లో ఈ భారీ రుసుమును ప్రకటిస్తూ ట్రంప్.. "అమెరికన్ కార్మికులకు అండగా నిలవాల్సింది పోయి, వారి స్థానంలో తక్కువ వేతనాలు, తక్కువ నైపుణ్యాలు ఉన్న విదేశీయులను నియమించుకోవడానికి కంపెనీలు H-1B కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేస్తున్నాయి" అని ఆరోపించారు.
అమెరికా నిబంధనల ప్రకారం.. హెచ్-1బి ప్రోగ్రామ్ కింద ప్రతి ఏటా 65,000 సాధారణ వీసాలు, ఉన్నత డిగ్రీలు (మాస్టర్స్) ఉన్న ఉద్యోగుల కోసం మరో 20,000 వీసాలను 3 నుండి 6 ఏళ్ల కాలపరిమితితో అందిస్తారు. ట్రంప్ ఈ కొత్త విధానాన్ని తీసుకురాకముందు, విదేశీ కార్మికులను నియమించుకునే అమెరికన్ కంపెనీలు (యజమానులు) వీసా కోసం కేవలం $2,000 నుండి $5,000 వరకు మాత్రమే రుసుము చెల్లించేవి.
అయితే, ఒక్కసారిగా ఈ ఖర్చును లక్ష డాలర్లకు పెంచడంతో టెక్ కంపెనీలకు ఇది మోయలేని భారంగా మారింది. ఈ రుసుము అమలులోకి వచ్చినప్పటి నుండి భారీ ఖర్చు కారణంగా కేవలం 85 మంది యజమానులు మాత్రమే ఈ మొత్తాన్ని చెల్లించినట్లు మార్చి నాటి అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కాగా, విద్యార్థి వీసాలపై (F-1/OPT) ఇప్పటికే అమెరికాలో ఉంటూ హెచ్-1బి కి మారే విదేశీయులకు మాత్రం ట్రంప్ ఈ అదనపు రుసుము నుండి మినహాయింపు ఇచ్చారు.
ఈ లక్ష డాలర్ల భారాన్ని సవాలు చేస్తూ అమెరికాలో యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో పాటు కనీసం మూడు వేర్వేరు ప్రధాన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ముఖ్యంగా 20 మంది డెమోక్రటిక్ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కూటమి ఈ విధానంపై కోర్టును ఆశ్రయించింది. ఈ కూటమికి నాయకత్వం వహించిన కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా ఫెడరల్ కోర్టు తీర్పును స్వాగతిస్తూ..మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు , కీలకమైన కార్మిక శక్తి అవసరాలను తీర్చేందుకు ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులను ఆకర్షించే అమెరికా సామర్థ్యంపై ట్రంప్ ప్రభుత్వం చేసిన దాడి ఇది.
ఈ చట్టవిరుద్ధమైన, ఖరీదైన పన్నును కొట్టివేయడం హర్షణీయం అని కొనియాడారు. ఈ తీర్పుతో హెచ్-1బి వీసాలపై అమెరికా వెళ్లాలనుకునే వేలాది మంది భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణులకు , వారిని నియమించుకునే టెక్ దిగ్గజాలకు ప్రస్తుతానికి పెద్ద ఊరట లభించినట్లయింది.


Click it and Unblock the Notifications
