మచిలీపట్నం పోర్టుపై అదిరిపోయే న్యూస్.. రూ.4 వేల కోట్ల పెట్టుబడితో సరికొత్తగా డీప్ సీ పోర్ట్
మచిలీపట్నం ఒకప్పుడు భారతదేశంలోని అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా వెలుగులు విరజిమ్మింది. శతాబ్దాల క్రితం ఈ పోర్ట్ నుంచి విలువైన రత్నాలు, ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, ప్రత్యేకంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బందరు వస్త్రాలు ప్రపంచ దేశాలకు ఎగుమతి అయ్యేవి. భారతీయ సముద్ర వాణిజ్యంలో మచిలీపట్నానికి ఒక విశిష్టమైన స్థానం ఉండేది. అయితే కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ మార్పులు, వాణిజ్య మార్గాల మార్పులతో ఈ పోర్ట్ ప్రాధాన్యత తగ్గిపోయి, దాదాపు శతాబ్దాల పాటు నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది.
చరిత్రకారుల ప్రకారం.. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచే మచిలీపట్నం భారత మహాసముద్ర వాణిజ్యంలో కీలక పాత్ర పోషించింది. గ్రీకు భూగోళ శాస్త్రవేత్త టోలెమీ కూడా తన రచనల్లో ఈ పోర్ట్ ప్రస్తావన తీసుకువచ్చారు. బహ్మనీ సుల్తాన్లు, విజయనగర సామ్రాజ్యం, గోల్కొండ కుతుబ్‌షాహీలు వంటి పాలకుల కాలంలో మచిలీపట్నం అత్యంత సంపన్నమైన వాణిజ్య కేంద్రంగా ఎదిగింది. హైదరాబాద్‌తో నేరుగా రహదారి ఉండటంతో వజ్రాలు, వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఇక్కడ నుండి ఎగుమతి అయ్యేవి. ఆ తరువాత యూరోపియన్ శక్తులు రంగప్రవేశం చేయడంతో డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్‌లు ఈ పోర్ట్‌పై ఆధిపత్యం కోసం పోటీ పడ్డారు.

అయితే 1864లో వచ్చిన భారీ తుఫాను మచిలీపట్నం చరిత్రలో కీలక మలుపు తీసుకొచ్చింది. ఆ తుఫానులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, పోర్ట్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ తరువాత నౌకాశ్రయం మళ్లీ పాత స్థాయికి చేరుకోలేకపోయింది. కాలక్రమంలో చెన్నై వంటి ఇతర పోర్టులు ఎదగడంతో మచిలీపట్నం ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. ఒకప్పుడు ప్రపంచ వాణిజ్య పటంలో మెరిసిన ఈ పోర్ట్, మత్స్యకారుల చిన్న పట్టణంగా మారిపోయింది.
ఇప్పుడీ చరిత్రకు మళ్లీ కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు రూ.4 వేల కోట్ల పెట్టుబడితో మచిలీపట్నం డీప్ సీ పోర్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఆధునిక సాంకేతికతతో, భారీ కార్గో నౌకలను స్వీకరించే సామర్థ్యంతో ఈ పోర్ట్‌ను నిర్మిస్తున్నారు. 2026 నాటికి ఈ పోర్ట్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. మొదటి దశలోనే కోట్ల టన్నుల కార్గో నిర్వహణ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ కొత్త పోర్ట్‌తో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన లాభాలు చేకూరనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, ఎరువులు, సిమెంట్, గ్రానైట్ వంటి వస్తువుల ఎగుమతి, దిగుమతులు సులభమవుతాయి. వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కలుగుతాయి. తీరప్రాంత అభివృద్ధి, రోడ్డు-రైల్వే మౌలిక వసతుల మెరుగుదల కూడా వేగంగా జరుగనుంది.
శతాబ్దాల పాటు పనికిరాకుండా పోయిన తరువాత మచిలీపట్నం మళ్లీ ప్రపంచ వాణిజ్య పటంలోకి అడుగుపెడుతోంది. ఒకప్పుడు భారతదేశానికి గర్వకారణమైన ఈ పోర్ట్, ఆధునిక రూపంలో తిరిగి తన ప్రస్తానాన్ని ప్రారంభించబోతోంది. ఏదేమైనా మచిలీపట్నం పోర్ట్ పునరుజ్జీవనం కేవలం ఒక మౌలిక వసతి ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఆర్థిక యుగానికి నాంది కూడా అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications