పేరులో విలాసం... అమ్మకాల్లో మాత్రం విలాపం.. కారణం ఏమిటంటే?
ప్రతి నగరంలోనే సాధారణ ఇల్లు, మధ్యతరగతి ఇల్లు, సంపన్న వర్గాలు ఉండే ఇల్లు ఉంటాయి. మొదటి రెండు రకాల ఇల్లు చాలా మందికి తెలిసి ఉంటాయి. కానీ సంపన్న వర్గాలు ఉండే విలాసవంతమైన (లగ్జరీ) ఇల్లు మాత్రం కొంత మందికే తెలిసి ఉంటాయి. ఇలాంటి ఇళ్లలో అద్భుతమైన సౌకర్యాలు ఉంటాయి. లంకంత ఉండే ఈ ఇళ్ళు ఆయా వర్గాల అభిరుచులకు అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తుంటారు. వీటి ధర కూడా అదే స్థాయిలో ఉంటాయి. కంపెనీల్లో ఉన్నత స్థాయి కొలువులు చేసేవారు, వ్యాపారస్తులు లగ్జరీ ఇళ్లను కొనుగోలుచేస్తుంటారు. ఈ ఇళ్ల ధర రూ. 3 కోట్ల కన్నా ఎక్కువ ఉంటుంది. అయితే ఇలాంటి ఇళ్ల అమ్మకాలు ఇటీవలే కాలంలో తక్కువ స్థాయిలోనే జరుగుతున్నట్టు హౌసింగ్ బ్రోకరేజ్ సంస్థ ప్రాప్ టైగర్ వెల్లడించింది.

మూడేళ్లలో ఎలా ఉందంటే..
గత మూడేళ్ల కాలంలో రియల్ ఎస్టేట్ డెవలపర్లు తాము నిర్మించిన లగ్జరీ ఇళ్లలో 45 శాతం వరకు మాత్రమే విక్రయించినట్టు తెలుస్తోంది. అంటే వీటి అమ్మకాలు 13 వేలు ఉన్నాయి. ఇంతకుముందు మాదిరిగా కాకుండా చాలా మంది ఇన్వెస్టర్లు ఇలాంటి లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసే విషయంలో తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నారు. కొంతమంది తాము నివాసం ఉండటానికి ఇంటికి కొనుగోలు చేస్తుంటే మరికొందరు మాత్రం తమ పెట్టుబడులపై మంచి రిటర్న్ ను కోరుకుంటున్నారు. అయితే పెట్టుబడులపై రిటర్న్ తక్కువగా ఉండటం వల్ల ఇన్వెస్టర్లు ఖరీదైన ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారట. దీని ఫలితంగానే అమ్మకాలు తగ్గుతున్నాయట.
ప్రాప్ టైగర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత మూడేళ్ల కాలంలో అంటే 2017 నుంచి 2019 వరకు డెవలపర్లు దేశంలోని 9 ప్రధాన నగరాల్లో 13,290 ఇళ్లను ప్రారంభించారు. అయితే వీటిలో కేవలం 5,926 లగ్జరీ ఇళ్లను మాత్రమే విక్రయించగలిగారు. ఈ తొమ్మిది నగరాల్లో అహ్మదాబాద్ (గాంధీనగర్ సహా), బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్ (భివాడి, ధారుహేరా, సోహ్న సహా), హైదరాబాద్, కోల్కతా, ముంబై, పూణే, నోయిడా ఉన్నాయి.
కాగా రూ.7 కోట్ల కన్నా ఎక్కువ ధర కలిగిన 1,131 ఇళ్లను అందుబాటులోకి తీసుకురాగా కేవలం 554 ఇల్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మరో 3,656 ఇళ్ళను రూ.5-7 కోట్ల ధరల శ్రేణిలో అందుబాటులోకి తీసుకురాగా ఇప్పటివరకు కేవలం 1,631 ఇల్లు అమ్ముడయ్యాయి. రూ.3-5 కోట్ల రూపాయల శ్రేణిలో 8,503 ఇళ్లను ప్రారంభించగా వీటిలో 3,471 ఇల్లు అమ్ముడయ్యాయి.

రియాల్టీ డిమాండ్ లో మందగమనం
పెద్ద నోట్ల రద్దు తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పై దెబ్బ పడింది. ముఖ్యంగా లగ్జరీ ఇళ్ల డిమాండ్ ఎక్కువ ప్రభావితం అయింది. అప్పటి నుంచి ట్రెండ్ ఇంకా పెద్దగా మారలేదని తెలుస్తోంది. ఇతర నివాస విభాగాల్లోనూ ప్రభావం ఎక్కువగానే ఉంది.

కరోనా దెబ్బ
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి మూలంగా దేశీయ రియల్ ఎస్టేట్ రంగం అన్ని రంగాల మాదిరిగానే దెబ్బతింటోంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గినట్టు పలు అంచనాలు వెలువడుతున్నాయి. రానున్న కాలంలో ఇళ్ల అమ్మకాలు ఇంకా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రంగంలో అమ్మకాలు తగ్గడం వల్ల ఈ రంగంపై ఆధారపడి సిమెంట్, స్టీల్, గృహోపకరణాల మార్కెట్ ప్రభావితం కావడానికి అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడతారు.


Click it and Unblock the Notifications