Covid 19: భారత జీడీపీలో 4% శాశ్వత నష్టం.. క్రిసిల్ హెచ్చరిక
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కొనసాగింపు ఉంటే భారత స్థూల జాతీయోత్పత్తిలో 4 శాతం శాశ్వతంగా నష్టపోయే అవకాశముందని క్రిసిల్ రీసెర్చ్ గురువారం తెలిపింది. లాక్ డౌన్ అనంతరం ఆర్థిక వ్యవస్థ కోలుకునే అవకాశం ఉన్నప్పటికీ కొంత వరకు ఆర్థిక కార్యకలాపాలు తిరిగి కోలుకోలేని పరిస్థితులు ఉన్నాయని, ఇది జీడీపీలో 4 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు క్రిసిల్ రీసెర్చ్ తెలిపినట్లు వార్తలు వచ్చాయి.

రాబోయే మూడేళ్లు కోలుకునే పరిస్థితి ఉండదు
లాక్ డౌన్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, దీనిని పొడిగిస్తే జీడీపీ సున్నాకు పడిపోతుందని క్రిసిల్ హెచ్చరించింది. లాక్ డౌన్‌ను ఇలాగే పొడిగించుకుంటూ వెళ్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు సున్నాగా నమోదవుతుందని తెలిపింది. జీడీపీకి 4 శాతం శాశ్వత నష్టం ఉంటుందని, రాబోయే మూడేళ్ల వరకు ఆర్థిక వ్యవస్థ కోలుకునే అవకాశం ఉండదని క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషి అన్నారు.

2008 కంటే పెను సంక్షోభం
2008 ప్రపంచ సంక్షోభం కంటే కరోనా ప్రభావం అతి ప్రమాదకరమని జోషి గుర్తు చేసారు. 2009 నుండి 2011 మధ్య సంక్షోభమే భారత్ పైన ప్రభావం పడిందని, ఇది మరింత ఎక్కువగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత నష్టాన్ని పూరించాలంటే భారత వృద్ధి రేటు రానున్న మూడేళ్లలో 8.5 శాతంగా ఉండాలని క్రిసిల్ అభిప్రాయపడింది. కానీ ఇది సాధ్యం కాకపోవచ్చునని తెలిపింది.

ఇది సరిపోదు.. టాప్-అప్
కేంద్రం గత నెలలో ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ సరిపోదని జోషి తెలిపారు. దాదాపు రూ.3.5 లక్షల కోట్ల నిధులు అవసరమని చెప్పారు. ద్రవ్య విధానం సరళంగా ఉండాలన్నారు. గృహ ఆదాయ అంతరాలు పరిష్కరించేందుకు టాప-అప్ సంక్షేమ చర్యలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. వ్యాపారులకు, చిన్న, మధ్యతరహా సంస్థలకు మద్దతివ్వాలన్నారు.


Click it and Unblock the Notifications