Reliance Capital: అంబానీ సోదరుల్లో ఒకరైన అనిల్ వ్యాపారాలు ఒకదాని తర్వాత మరొకటి దివాలా తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన మరొక కంపెనీ చేతులు మారుతోంది. దివాలా పరిష్కార ప్రక్రియ కింద ఇది జరిగింది.
అనిల్ అంబానీకి చెందిన ఫైనాన్స్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్. దీనిని హిందూజా గ్రూప్ దివాలా ప్రక్రియలో బిడ్డింగ్ ద్వారా దక్కించుకుంది. దీనికి తాజాగా రిజర్వు బ్యాంక్ నుంచి అవసరమైన అనుమతి సైతం లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిలయన్స్ క్యాపిటల్ బోర్డులో హిందూజా గ్రూప్‌కు చెందిన ఐదుగురు ప్రతినిధులను డైరెక్టర్లుగా చేర్చే ప్రణాళికను సెంట్రల్ బ్యాంక్ ఆమోదించింది. ఏప్రిల్‌లో జరిగిన రెండో రౌండ్ వేలంలో రిలయన్స్ క్యాపిటల్‌ను కొనుగోలు చేసేందుకు హిందూజా గ్రూప్ అత్యధికంగా రూ.9,650 కోట్లకు బిడ్ దాఖలు చేసి విజయవంతమైంది.

ఈ లెక్కన దాదాపు రుణదాతలు రూ.10,000 కోట్ల వరకు తిరిగి పొందేందుకు వీలు ఉంటుందని తెలుస్తోంది. అయితే కంపెనీకి గతంలో రుణాలు ఇచ్చిన బ్యాంకులు మిగిలిన మెుత్తాన్ని నష్టపోవాల్సిందే. ఈ జాబితాలో దేశీయ అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీతో పాటు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFO కూడా ఉన్నాయి. వాస్తవాలను పరిశీలిస్తే రిలయన్స్ క్యాపిటల్ కు రుణాలు అందించిన బ్యాంకులు, ఇతర రుణదాతలు వారు ఇచ్చిన మెుత్తం సొమ్ములో కేవలం 43 శాతం మాత్రమే తిరిగి పొందే అవకాశం ఉందని వెల్లడైంది. ప్రస్తుతం కంపెనీ వద్ద కేవలం రూ.400 కోట్ల నగదు నిల్వలు మాత్రమే ఉన్నాయి.
సెప్టెంబరు 2021లో రిలయన్స్ క్యాపిటల్ తన వాటాదారులకు కంపెనీకి రూ.40,000 కోట్ల కంటే ఎక్కువ రుణాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించింది. రూ.23,666 కోట్ల ఆర్థిక రుణదాతల క్లెయిమ్‌లను అడ్మినిస్ట్రేటర్ ధృవీకరించారు. ఈ క్రమంలో ఎల్ఐసీ అప్పు రూ.3,400 కోట్లు, EPFO అప్పు రూ.2,500 కోట్లుగా ఉన్నాయి. వీటిలో ఎల్ఐసీకి రూ.1,460 కోట్లు, ఈపీఎఫ్ఓకు రూ.1,075 కోట్లు తిరిగి రావొచ్చని అంచనా. మిగిలిన సొమ్ము మర్చిపోవాల్సిందే మరి. 2007లో ఫోర్బ్స్ ఇండియా ప్రకారం 45 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగి ఉన్న అనిల్ అంబానీ సంపద ప్రస్తుతం సున్నాకు చేరుకుంది.


Click it and Unblock the Notifications