IT Refunds: సువిశాల భారతదేశంలో ఎంతో మంది ఉద్యోగులు వైట్ కాలర్ జాబ్స్ చేస్తున్నారు. వారిలో లక్షల కొద్దీ సంపాదించేవారు చాలామంది ఉన్నారు. కానీ పన్ను చెల్లించే వారి సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే అత్యంత తక్కువగా ఉంది. అంటే పన్ను ఎగవేతకు పాల్పడేవారు కొందరుండగా, అక్రమంగా రీఫండ్స్ పొంది ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే వారు మరి కొందరు ఉన్నారు. సక్రమంగా టాక్స్ కట్టే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండానే అక్రమార్కుల పట్ల ఆదాయపు పన్ను శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది.
IT విభాగం నిబంధనల మేరకు జూలై 31 తేదీలోపు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం పూర్తి కావాలి. అనంతరం సమయానుగుణంగా ట్యాక్స్ ప్లేయర్లు చెల్లించిన పన్నుకుగాను రీఫండ్లు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నడవాలంటే కేవలం ITR ఫైల్ చేసి ఊరుకుంటే సరిపోదు. అనంతరం దానిని వెరిఫై కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడంలో ఫెయిల్ అయితే రిటర్నులు దాఖలు చేయని వారిగానే ప్రభుత్వం పరిగణిస్తుంది.

జూలై 31 నాటికి పూర్తయిన ITRలను వెరిఫై చేసేందుకు వాటిని దాఖలు చేసిన అనంతరం నెలరోజులపాటు సమయం ఉంటుంది. అంటే ఆగస్టు 31 లోపు ఈ పనిని పూర్తి చేయాలి. గడువు తేదీకి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. గత ఆర్థిక సంవత్సరానికిగాను సుమారు 7.41 కోట్ల రిటర్నులు ఫైల్ అయినట్లు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. ఆగస్టు 20 నాటికి 7.09 కోట్ల ITRలు వెరిఫై కాబడినట్లు పేర్కొంది. అంటే దాదాపు 32 లక్షల రిటర్నులు ఇంకా వెరిఫై కావాల్సి ఉంది. ఇందుకుగాను ఇక వారమే సమయం ఉండటంతో ఈ వ్యవహారాన్ని త్వరగా పూర్తి చేయాలని IT శాఖ ట్యాక్స్ పేయర్స్‌ను కోరుతోంది.
ఇలా చేయడంలో ఫెయిల్ అయితే రిటర్నులు దాఖలు చేసినా సరే చేయనివారిగానే లెక్కించి చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది. లేనిపక్షంలో ఆ ITR చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. దీంతో మరోసారి రిటర్న్ ఫైల్ చేయాల్సిందేనని తెలిపింది. అయితే జూలై 31 ముగిసిపోవడంతో జరిమానాతో సహా చెల్లించాల్సి వస్తుందని గుర్తు చేసింది. వీటికి తోడు వారిపై ఆదాయ పన్ను శాఖ తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది. ఆధార్ OTP ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చని సూచించింది.


Click it and Unblock the Notifications