రైతులకు సగం రేటుకే ట్రాక్టర్.. PM Kisan Tractor Scheme పూర్తి వివరాలు..
Subsidy on Tractor: దేశంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. ఖర్చులు పెరగటంతో వ్యవసాయం భారంగా మారుతోందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మోదీ సర్కార్ రైతులను ఆదుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మరో అడుగు ముందుకేసి వారికి సబ్సిడీపై ట్రాక్టర్లను సైతం అందిస్తోంది. అయితే దేశంలో చాలా మంది అన్నదాతలకు ఈ స్కీమ్ గురించి తెలియదు.

వ్యవసాయమే వెన్నుముక..
భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. జనాభాలో దాదాపు సగం మంది వ్యవసాయంపైనే ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో రైతులు పొలాల్లో పని చేసేందుకు ట్రాక్టర్లు తప్పక అవసరం. వ్యవసాయ పనులకు ఇది అత్యంత ముఖ్యమైన యంత్రం పైగా పనులు చాలా సులభతరం అవుతాయి.

50 శాతం సబ్సిడీ..
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద.. ట్రాక్టర్ల కొనుగోలుపై 50% వరకు సబ్సిడీని అందిస్తోంది. ఎవరైనా రైతు ఈ స్కీమ్ కింద ట్రాక్టర్‌ను కొనుగోలు చేస్తే.. వారు స్కీమ్ అందిస్తున్న ప్రయోజనాలను పొందవచ్చు. అంటే వారికి సగం డబ్బు ఆదా అవుతుంది. కేంద్రం అందిస్తున్న ఈ సహకారం తక్కువ ఆదాయం కలిగిన చిన్నసన్నకారు రైతులకు పెద్ద వరంగా మారింది. ఈ స్కీమ్ కింద రైతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సబ్సిడీని అందజేస్తోంది.

ఎవరెవరికి వర్తిస్తుంది..
కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ వర్తిస్తుంది. అయితే దీని కింద లబ్ధి పొందాలనుకునే రైతులు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పైగా ప్రభుత్వం సబ్సిడీ మెుత్తాన్ని నేరుగా సదరు రైతు ఖాతాలో జమచేస్తుంది. దీని కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రైతు సోదరులు తమ సమీపంలోని CSC కేంద్రాన్ని సందర్శించి సులువుగా దరఖాస్తును పూరించవచ్చు.

సబ్సిడీ రూల్స్ ఇవే..
సబ్సిడీ పొందటానికి మెుదటి ముఖ్యమైన షరతు ఏమిటంటే.. సదరు రైతు గడచిన ఏడేళ్లలో ఎలాంటి ట్రాక్టర్ కొనుగోలు చేయకూడదు. పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే రైతు తన పేరు మీద వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి. ఒక రైతు ఒక ట్రాక్టర్‌పై మాత్రమే సబ్సిడీ పొందేందుకు అర్హులు. పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద ట్రాక్టర్ కొనుగోలు చేసే రైతు ఇతర సబ్సిడీ పథకంతో సంబంధం కలిగి ఉండకూడదు. కుటుంబం నుంచి ఒక వ్యక్తి మాత్రమే సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని గుర్తుంచుకోండి.
అవసరమైన డాక్యుమెంట్లు..
స్కీమ్ కింద సబ్సిడీ ప్రయోజనాన్ని పొందేందుకు దరఖాస్తుదారు ఆధార్ కార్డు, భూమి పత్రాలతో పాటు.. ఓటరు ID కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డును సమర్పించాల్సి ఉంటుంది. వీటికి తోడు దరఖాస్తుదారు బ్యాంక్ ఖాతా వివరాలు, మెుబైల్ నంబర్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అందించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications