Income Tax: దేశంలో మూన్‌లైటింగ్ అంశం చర్చనీయాంశంగా మారటంతో పాటు వివాదంగానూ మారిపోయింది. దీనిపై కొన్ని కంపెనీలు సానుకూలంగా ఉండగా.. మరికొన్ని ససేమిరా ఒప్పుకునేది లేదని చెప్పాయి. అలా రెండు ఉద్యోగాలు చేస్తూ దొరికిన వారిని కంపెనీలు తొలగించిన సంఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. ఇటీవల టెక్ మహీంద్రా మాత్రం సైడ్ గిగ్ చేసినా అందుకు ముందుగా తమకు తప్పకుండా చెప్పాలని వెల్లడించింది.

టాక్స్ చట్టాలు..
ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా కంపెనీలో పనిచేస్తూ.. మరో కంపెనీకి సైతం ఏకకాలంలో పనిచేయటాన్ని మూన్‌లైటింగ్ అని వ్యవహరిస్తారు. అయితే ఇలా రెండో ఉద్యోగం నుంచి వచ్చే డబ్బుపై సైతం టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా కంపెనీ లేదా వ్యక్తి మరో వ్యక్తికి కాంట్రాక్ట్ ఉద్యోగం లేదా ప్రొఫెసనల్ ఫీజు కింద నెలకు రూ.30 వేల కంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తే దానిపై టీడీఎస్ రూల్స్ వర్తిస్తాయి. కాంట్రాక్ట్ వర్క్ కింద చేసే చెల్లింపులకు ఇన్కమ్ టాక్స్ చట్టంలోని సెక్షన్- 194C కింద టీడీఎస్ రూల్స్ వర్తిస్తాయని పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ ప్రిన్సిపల్ చీఫ్ ఐటీ కమిషనర్ ఆర్.రవిచంద్రన్ వెల్లడించారు.

టీడీఎస్ రూల్స్..
కాంట్రాక్ట్ వర్క్ కోసం ఏ రూపంలో నగదు చెల్లించినా అది రూ.30 వేల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ మెుత్తంపై 10 శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తున్న మెుత్తం విలువ రూ.లక్ష దాటినా టీడీఎస్ తప్పక చెల్లించాలి. అలా టాక్స్ చట్టాల ప్రకారం వర్తించే పన్నులన్నీ చెల్లించాల్సి ఉంటుంది.

స్టార్టప్ కన్సల్టెంట్..
ఒకే కంపెనీలో కాకుండా అనేక సంస్థలకు కన్సల్టెంట్ గా ఏకకాలంలో చాలా మంది పనిచేస్తుంటారు. వీరు ప్రస్తుతం ఎక్కువగా స్టార్టప్ కంపెనీల్లో తమ సేవలను అందిస్తున్నారు. ఇలాంటి వారికి సైతం ఆదాయపు పన్ను చట్టం ప్రకారం టీడీఎస్ కట్ చేయబడుతుంది. అయితే వ్యక్తిగతంగా వారు టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు వీటిని రిఫండ్ కూడా పొందేందుకు వెసులుబాటు ఉంటుంది. అయితే ఇందుకోసం సరైన ఛార్టెడ్ అకౌంటెంట్ ను సంప్రదించి సలహాలు పొందవచ్చు.


Click it and Unblock the Notifications