భారత్‌లో జపాన్ ప్రధాని: బిలియన్ డాలర్ల కొద్దీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిడ భారత పర్యటన ఆరంభమైంది. కొద్దిసేపటి కిందటే ఆయన దేశ రాజధానిలో ల్యాండ్ అయ్యారు. రెండు రోజుల పాటు పర్యటిస్తారు. తన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ద్వైపాక్షిక చర్చలకు హాజరవుతారు. 14వ భారత్-జపాన్ వార్షిక ఉన్నతస్థాయి సదస్సులో పాల్గొననున్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేస్తారు.

ఢిల్లీలో జపాన్ ప్రధాని..
టోక్యో నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఫ్యుమియో కిషిడ కొద్దిసేపటి కిందటే ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయనకు స్వాగతం పలికారు. భారత్-జపాన్ మధ్య వార్షిక ఉన్నత స్థాయి సమావేశం చివరిసారిగా 2018లో టోక్యోలో ఏర్పాటైంది. ఈ నాలుగు సంవత్సరాల విరామం తరువాత.. మళ్లీ ఈ సదస్సు ఏర్పాటైంది. ఈ సారి ఢిల్లీ దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఇందులో పాల్గొనడానికి ఫ్యుమియో కిషిడ భారత్‌కు వచ్చారు.

పలు ప్రాజెక్టుల్లో..
భారత్‌లో పలు నగరాభివృద్ధి ప్రాజెక్టులకు జపాన్.. అన్ని రకాలుగా తన సహకారాన్ని అందిస్తోంది. ఆర్థికం, సాంకేతికపరంగా దోహదం చేస్తోంది. హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీలోనూ కీలక పాత్రను పోషిస్తోంది జపాన్. భారత్-జపాన్ మధ్య అన్ని రంగాల్లోనూ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. దశాబ్దాల కాలంగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, సాంస్కృతిక సంబంధాలు ధృడంగా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రధాని.. భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు జపాన్ మీడియా వెల్లడించింది.

అయిదేళ్లల్లో 42 బిలియన్ డాలర్లు..
అయిదు సంవత్సరాల వ్యవధిలో వేర్వేరు రంగాల్లో 42 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను పెట్టడానికి అవసరమైన ప్రకటనలను ఫ్యుమియో కిషడ చేస్తారని పేర్కొంది. దీనికి సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందాల సంతకాల కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపింది. భారత్ కేంద్రంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తోన్న జపాన్ సంస్థలు తమ వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తరింపజేసుకోవడానికి అవసరమైన అనుమతులను సింగిల్ విండో సిస్టమ్‌లో మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరతారని జపాన్ మీడియా పేర్కొంది.

క్లీన్ ఎనర్జీ సెక్టార్‌లో..
కర్బన ఉద్గారాల తగ్గింపు, క్లీన్ ఎనర్జీ విభాగాల్లో భారత్ సహకారాన్ని కోరుతుందని తెలిపింది. రెండు రోజుల తన పర్యటనను ముగించుకున్న అనంతరం ఫ్యుమియో కిషిడా.. నేరుగా కాంబోడియాకు బయలుదేరి వెళ్తారు. ఆ దేశ ప్రధాని హ్యున్‌సెన్‌తో సమావేశమౌతారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన భారత్‌కు రావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నప్పటికీ.. దానికి సంబంధించిన అంశాలేవీ ఈ పర్యటనలో ఉండబోవని తెలుస్తోంది.

ఉక్రెయిన్ వైపు జపాన్..
ఈ యుద్ధంలో జపాన్.. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచింది. రష్యాపై ఆంక్షలను సైతం విధించింది. భారత్ మాత్రం తటస్థ వైఖరిని కనపరుస్తోంది. రష్యాతో సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహ సంబంధాల దృష్ట్యా తటస్థంగా ఉంటోంది. ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితి వంటి అత్యున్నత అంతర్జాతీయ వేదిక మీద కూడా స్పష్టం చేసింది. రష్యాకు వ్యతిరేకంగా నిర్వహించిన ఓటింగ్‌కు దూరంగా ఉంది. యుద్ధాన్ని మాత్రం వ్యతిరేకిస్తోంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది భారత్.


Click it and Unblock the Notifications