భారత ఎలక్ట్రికల్ వెహికల్స్ సెక్టార్‌లో సుజుకి భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిడ భారత పర్యటన ఆరంభమైంది. కొద్దిసేపటి కిందటే ఆయన దేశ రాజధానిలో ల్యాండ్ అయ్యారు. రెండు రోజుల పాటు పర్యటిస్తారు. తన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ద్వైపాక్షిక చర్చలకు హాజరవుతారు. 14వ భారత్-జపాన్ వార్షిక ఉన్నతస్థాయి సదస్సులో పాల్గొననున్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేస్తారు.

ప్రధానితో భేటీ..
టోక్యో నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఫ్యుమియో కిషిడ కొద్దిసేపటి కిందటే ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయనకు స్వాగతం పలికారు. భారత్-జపాన్ మధ్య వార్షిక ఉన్నత స్థాయి సమావేశం చివరిసారిగా 2018లో టోక్యోలో ఏర్పాటైంది. ఈ నాలుగు సంవత్సరాల విరామం తరువాత.. మళ్లీ ఈ సదస్సు ఏర్పాటైంది. ఈ సారి ఢిల్లీ దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఇందులో పాల్గొనడానికి ఫ్యుమియో కిషిడ భారత్‌కు వచ్చారు. కొద్దిసేపటి కిందటే ప్రధాని మోడీతో ఆయన భేటీ అయ్యారు.

జపాన్ సహకారంతో..
భారత్‌లో పలు నగరాభివృద్ధి ప్రాజెక్టులకు జపాన్.. అన్ని రకాలుగా తన సహకారాన్ని అందిస్తోంది. ఆర్థికం, సాంకేతికపరంగా దోహదం చేస్తోంది. హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీలోనూ కీలక పాత్రను పోషిస్తోంది జపాన్. భారత్-జపాన్ మధ్య అన్ని రంగాల్లోనూ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. దశాబ్దాల కాలంగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, సాంస్కృతిక సంబంధాలు ధృడంగా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రధాని.. భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు జపాన్ మీడియా వెల్లడించింది.

ఈవీ సెక్టార్‌లో..
అదే సమయంలో జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సుజుకి- భారత ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్‌లో భారీ పెట్టుబడులను ప్రకటించనున్నట్లు పేర్కొంది. 150 బిలియన్ యెన్‌ల మేర ఈ పెట్టుబడులు ఉండొచ్చని అంచనా వేసింది. భారత్‌లో ఎలక్ట్రానిక్ వెహికల్ ప్రొడక్షన్‌ను సాధ్యమైనంత త్వరగా మొదలు పెట్టేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నట్లు స్పష్టం చేసింది. ఫ్యుమియో కిషిడ పర్యటన సందర్భంగా- ఈ మేరకు పరస్పర అవగాహన ఒప్పందాలను కుదర్చుకునే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడింది. 2025 నాటికి భారత్‌లో పూర్తిస్థాయిలో ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ ప్రొడక్షన్‌ను ప్రారంభించేలా ఈ ప్రణాళిక ఉందని తెలిపింది.

42 బిలియన్ డాలర్ల మేర
అయిదు సంవత్సరాల వ్యవధిలో వేర్వేరు రంగాల్లో 42 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను పెట్టడానికి అవసరమైన ప్రకటనలను ఫ్యుమియో కిషడ చేస్తారని పేర్కొంది. దీనికి సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందాల సంతకాల కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపింది. భారత్ కేంద్రంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తోన్న జపాన్ సంస్థలు తమ వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తరింపజేసుకోవడానికి అవసరమైన అనుమతులను సింగిల్ విండో సిస్టమ్‌లో మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరతారని జపాన్ మీడియా పేర్కొంది.


Click it and Unblock the Notifications