IT News: క్యాంపస్ హైరింగ్ తగ్గించిన IT, టెక్ కంపెనీలు.. యువత జాబ్ కలలు ఆవిరి..
IT News: IT, టెక్ రంగాల్లో కొనసాగుతున్న తిరోగమనం కంపెనీల్లో భారీ తొలగింపులకు దారితీసింది. అయితే ఇప్పుడు ఈ మందగమనం కళాశాలల క్యాంపస్‌లకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. దేశంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ తగ్గాయని నిపుణులు, పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చదువు పూర్తయ్యే నాటికి కొలువు కొట్టాలనుకుంటున్న యువతకు ఇది నిజంగా చేదువార్తనే చెప్పుకోవాలి.
ప్రస్తుత మందగమనం ఈ సంవత్సరం క్యాంపస్ నియామకాలపై ఖచ్చితంగా ప్రభావం చూపిందని SaaS కంపెనీ ఫోర్‌కైట్స్‌లో మానవ వనరుల డైరెక్టర్ (APAC) కళ్యాణ్ దురైరాజ్ అన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కంపెనీలు తమ నియామక ప్రణాళికలపై జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాయని.. దీని కారణంగా ఈ ఏడాది క్యాంపర్ రిక్రూట్మెంట్స్ సంఖ్య తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కాలేజీ ప్లేస్‌మెంట్ సెల్ సభ్యులు కూడా ఈ ధోరణిని గమనిస్తూనే ఉన్నారు.

టెక్నీలజీ విభాగాల్లో నియామకాలు గతంలో కంటే దాదాపు 20-25 శాతం మేర తగ్గాయని వారు చెబుతున్నారు. రిక్రూట్మెంట్ సమయంలో టెక్ కంపెనీలు తక్కువగా వస్తున్నందున విద్యార్థుల మధ్య పోటీ తీవ్రతరం అవుతోందని ప్లేస్ మెంట్ సెల్ విభాగంలోనివారు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎంపికై కంపెనీలో ఆన్‌బోర్డింగ్ కోసం దాదాపు ఏడాది నుంచి ఎదురుచూస్తున్న విద్యార్థులు ఆఫర్ లెటర్లతో కంపెనీల నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు.
ఇటీవలి కాలంలో వ్యాపారంలో మందగమనం కారణంగా దేశీయ టెక్నాలజీ కంపెనీలైన TCS, Infosys, Tech Mahindra, Capgemini, Accenture, Mphais, LTI Mindtreeతో పాటు మరిన్ని కంపెనీలు ఆన్‌బోర్డింగ్ ఆలస్యం చేస్తున్నట్లు ఇప్పటికే వార్తల్లో వెల్లడైంది. 2021 నవంబరులో విప్రోలో జాబ్ ఆఫర్ అందుకున్న వారికి సైతం ఇంకా కంపెనీ నుంచి పిలుపు రాలేదని వెల్లడైంది. ప్రస్తుత సెషన్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా పొందిన ఇంజనీరింగ్ విద్యార్థులు ఆన్‌బోర్డింగ్‌లో కూడా ఆలస్యం అవుతుందని CIEL HRలో IT స్టాఫింగ్ వైస్ ప్రెసిడెంట్ అనూప్ మీనన్ అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం కంపెనీల్లో 5-10 సంవత్సరాల అనుభవం ఉన్న మిడ్-లెవల్ ఉద్యోగులకు అధికంగా డిమాండ్ ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications