Wipro News: దేశీయ దిగ్గజ ఐటీ సేవల సంస్థ విప్రో లిమిటెడ్ విదేశీ పన్నుల విషయంలో పోరాటం చేస్తోంది. ఈ పోరాటం భారతీయ కంపెనీలకు చాలా కీలకమైనదిగా తెలుస్తోంది. విదేశీ పన్నులను వ్యయంగా క్లెయిమ్ చేసే అర్హత కంపెనీకి ఉందా అనే విషయంపై కర్ణాటక హైకోర్డు త్వరలో నిర్ణయించనుంది.

కంపెనీ వాదన..
ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న ఆదాయపుపన్ను చట్టం ప్రకారం విదేశీ పన్నులకు ఎలాంటి క్రెడిట్ అనుమతించబడదని.. అందువల్ల తాము చెల్లించే విదేశీ పన్నులకు మినహాయింపు తప్పక అందుబాటులో ఉండాలని కంపెనీ వాదించింది. అయితే పన్నుగా చెల్లించే ఏ మొత్తం అయినా.. మినహాయించదగిన ఖర్చు కాదని చట్టం చెబుతోందని డెలాయిట్ ఇండియా భాగస్వామి సుమిత్ సింఘానియా హైలైట్ చేశారు.

హైకోర్టు ముందు ప్రశ్నలు..
ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం వర్తించే ద్వంద్వ పన్నుల ఎగవేత ఒప్పందాల ప్రకారం క్రెడిట్ అనుమతించబడని విదేశీ ప్రభుత్వాలకు విప్రో చెల్లించే పన్నులను దాని వ్యాపార ఆదాయం నుంచి మినహాయింపుగా అనుమతించాలా అనేది హైకోర్టు ముందున్న ప్రశ్న. ఈ క్రమంలో డబ్బును తాము వ్యాపార ప్రయోజనాల కోసం మాత్రమే ఖర్చు చేసినందున క్లెయిమ్ అనుమతించాలని విప్రో వాదిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ తాను చెల్లించిన విదేశీ పన్ను బ్యాలెన్స్‌ను క్లెయిమ్ చేసింది.

రిలయన్స్ విషయంలో..
ప్రస్తుతం న్యాయవ్యవస్థలో కూడా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కేసులో బాంబే హైకోర్టు పన్ను శాఖకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన విషయాన్ని ఇప్పుడు చాలా మంది ఉదాహరణగా చెబుతున్నారు. విదేశాల్లో చెల్లించే పన్నులను ఆదాయాన్ని సంపాదించడానికి చేసిన వ్యయంగా పరిగణించాలని,అందువల్ల మినహాయింపుగా అనుమతించబడుతుందని అప్పట్లో కోర్డు పేర్కొంది.

కిర్లోస్కర్ కంపెనీ విషయంలో..
రిలయన్స్ విషయంలో కంపెనీకి అనుకూలంగా తీర్చు వచ్చినప్పటికీ.. కర్ణాటక హైకోర్డు కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీ విషయంలో విరుద్ధమైన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంది. ప్రస్తుతం విప్రో సైతం ఇదే హైకోర్టులో ఉన్నందున తీర్పు ప్రతికూలంగా వెలువడవచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే ముందు తీర్పులో చట్టంలోని ఏదైనా నిబంధనను తగినంత విశ్లేషించబడలేదని విప్రో నిరూపించగలిగితే కోర్టు తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications