IT News: కరోనా కాలంలో టెక్ ఉద్యోగులు కట్టుకున్న కలల కోటలు బీటలువారిన సంగతి తెలిసిందే. సూపర్ ఫ్లెక్సిబలిటీలకు అలవాటుపడిపోయిన చాలా మంది టెక్కీలు ప్రస్తుతం కంపెనీలు చెప్పిన మాటలు లైట్ తీసుకుంటున్నారు. దీంతో దిగ్గజ కంపెనీలు సైతం మాటలతో చెప్పటం మానేసి చేతల్లో చూపించటం మెుదలెట్టాయి.
వాస్తవానికి ప్రస్తుతం కొంత మంది టెక్ ఉద్యోగుల ప్రవర్తన చూస్తుంటే ఉద్యోగాలు అవసరమై జాబ్ చేస్తున్నారా లేక కంపెనీలను బలికించటానికి ఉద్యోగం చేస్తున్నారా అన్నట్లుగా ఉన్నాయి పరిస్థితులు. ఇలాంటి కొందరి వల్ల మెుత్తం కంపెనీలోని ఉద్యోగులు ప్రభావితం కాకూడదని నిర్ణయించుకున్న టెక్ కంపెనీలు కఠిన చర్యలకు దిగుతున్నాయి. ఇప్పటికే వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్న తమ ఉద్యోగులకు పదేపదే రిమైండర్‌ల తర్వాత కూడా కార్యాలయానికి తిరిగి రావాలనే నిబంధనలను చాలా మంది ధిక్కరిస్తున్నారు. ఈ విషయంపై కాగ్నిజెంట్ చాలా సీరియస్ గా ఉంది.

ఆఫీసులకు రావాలని చెప్పినా పెడచెవిన పెడుతున్న టెక్కీలను తొలగించవచ్చని ఐటీ మేజర్ కాగ్నిజెంట్ హెచ్చరించిందని వెల్లడైంది. ఏప్రిల్ 15న ఉద్యోగులకు రాసిన లేఖ ప్రకారం కంపెనీ హెచ్చరించినప్పటికీ ఆఫీసులకు రాని ఉద్యోగులు ఎప్పటి నుంచి హాజరవుతారో చెప్పాలని కోరింది. ఆఫీసుకు హాజరుకావటంలో వైఫల్యం కంపెనీ విధానాలక ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనకు దారితీస్తుందని అందులో పేర్కొంది. అలాంటి ఉద్యోగులపై తగిన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. దీనికి ముందు ఫిబ్రవరిలో ఐటీ సేవల సంస్థ భారతదేశంలోని తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసుల నుంచి పనిచేయాలని కోరిన సంగతి తెలిసిందే.
ఈ విషయాన్ని కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ ఫిబ్రవరిలో ఉద్యోగులకు కమ్యూనికేట్ చేశారు. వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలని లేదా వారి టీమ్ లీడర్ చెప్పినట్లుగా హాజరవ్వాలని చెప్పారు. వార్షిక నివేదిక ప్రకారం కంపెనీలో మెుత్తం ఉద్యోగుల సంఖ్య 347,700 ఉండగా.. వీరిలో 254,000 మంది భారతదేశంలోనే ఉన్నట్లు వెల్లడైంది. ఒక అడుగు ముందుగానే ఉన్న భారతీయ టెక్ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందిగా 2023లోనే నిర్థేశించాయి. టెక్ దిగ్గజం టీసీఎస్ ఏకంగా వారంలో 5 రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని చెబుతూ తదనుగుణంగా షెడ్యూల్ రూపొందించింది.
తాజా డేటా ప్రకారం కాగ్నిజెంట్ అట్రిషన్ రేటు 10 శాతం పాయింట్లు తగ్గి 12 నెలల ప్రాతిపదికన 13.1 శాతానికి చేరుకుంది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రేటు 1 శాతం పెరిగి 82 శాతానికి చేరుకుంది. కాగ్నిజెంట్ క్లయింట్లు విచక్షణతో ఖర్చు చేయడం వల్ల ఆదాయం ఏడాది ప్రాతిపదికన 1.1 శాతం పడిపోయి 4.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications