భారత్‌ను చూసి ప్రపంచ దేశాలు నేర్చుకుంటోన్నాయి: కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్‌లో భారత అగ్రరాజ్యంగా దూసుకెళ్తోందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు. ఐటీ ఎగుమతుల్లో తిరుగులేని ఆధిక్యతను సాధించే దిశగా ప్రయాణిస్తున్నామని అన్నారు. ఐటీ ఎగమతుల విషయంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, దీన్ని అందుకోవడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఐటీ రంగంలో భారత్ ప్రపంచ దేశాల్లోనే అగ్రస్థానంలో చేరుకునే విషయంలోో యంగ్ ఇండియా వాటా అధికమని పేర్కొన్నారు.
ఎంటర్‌ప్రెన్యువర్ వార్షిక సమ్మిట్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వర్చువల్ విధానంలో ఆయన ఇందులో పాల్గొన్నారు. భారత్‌ను చూసి అనేక దేశాలు నేర్చుకుంటున్నాయని అన్నారు. భారత ఐటీ ఎకో సిస్టమ్ లక్షలాదిమంది నిపుణులను ప్రపంచానికి అందించిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారత యువతీ యువకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తమ సత్తా చాటుతున్నారని పీయూష్ గోయెల్ వ్యాఖ్యానించారు. ఈ రంగంపై తమ పట్టు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుందని అన్నారు.

స్వదేశంలో గానీ.. విదేశాల్లో గానీ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారత నిపుణులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్నారని చెప్పారు. దీని ఫలితంగా ఈ సెక్టార్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించామని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారత ఎగుమతులు 150 బిలియన్ డాలర్లకు చేరుకోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని పీయూష్ గోయెల్ అన్నారు. ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరంలో తాము ఈ లక్ష్యాన్ని అందుకుంటామంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దేశ ఐటీ ఎగుమతులను ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనేది తమ లక్ష్యమని పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలోనూ ఐటీ ఎగుమతులు నిరాటంకంగా సాగాయని అన్నారు. ఐటీ ఎగుమతులను ట్రిలియన్ డాలర్లకు చేర్చే విషయంపై ఇప్పటికే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకున్నామని, వాటిని పక్కాగా ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పారు. ఐటీతో పాటు ఆర్థిక రంగాన్ని నడిపించే ఇతర సెగ్మెంట్లనూ ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.


Click it and Unblock the Notifications