SFT ఫైలింగ్ గడువును రెండు రోజులు పొడిగించిన IT శాఖ.. ఆర్థిక సంస్థలూ త్వరపడండి!!
Income Tax News: అధికంగా ఆర్జిస్తున్న వ్యక్తులు ప్రతి ఏటా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన విషయం తెలిసిందే. అదే విధంగా తమ క్లయింట్లు జరిపే ఎక్కువ విలువ కలిగిన లావాదేవీలను ఆయా ఆర్థిక సంస్థలు IT శాఖకు నివేదించాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల స్టేట్ మెంట్(SFT) ద్వారా వీటి వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి అందిస్తూ ఉంటాయి. ఇందుకు సంబంధించి మరికొంత సమయాన్ని పెంచుతున్నట్లు IT శాఖ ప్రకటించింది.
2022-23లో SFT రిటర్న్‌లను దాఖలు చేయడానికి తుది గడువును మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు IT డిపార్ట్ మెంట్ తెలిపింది. తద్వారా తమ క్లయింట్లు చేసిన అధిక-విలువ కలిగిన లావాదేవీలను నివేదించడానికి బ్యాంకులు, విదేశీ మారకపు డీలర్‌లు మరియు ఇతర రిపోర్టింగ్ ఎంటిటీలకు అదనపు సమయం లభించినట్లైంది.

వాస్తవానికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన SFT ఫైల్ చేయడానికి చివరి తేదీ మే 31. అయితే రిపోర్టింగ్ పోర్టల్‌లో అధిక ట్రాఫిక్ కారణంగా కొందరు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు IT విభాగం దృష్టికి వెళ్లింది. దీంతో రిటర్నులను సజావుగా ఫైల్ చేయడం కోసం మరో రెండు రోజుల పాటు పోర్టల్ తెరిచే ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్‌లో చేసింది.
SFT రిటర్న్‌ల దాఖలులో జాప్యం జరిగితే, డిఫాల్ట్ అయిన ప్రతి రోజుకు వెయ్యి వరకు జరిమానా విధించవచ్చు. నాన్-ఫైలింగ్ లేదా సరికాని స్టేట్‌మెంట్‌లను ఫైల్ చేయడం వల్ల కూడా పెనాల్టీ పడే అవకాశం ఉంది. ఒక వ్యక్తి చేసిన అధిక-విలువ లావాదేవీలను ఈ SFT ద్వారానే ఆదాయపు పన్ను శాఖ ట్రాక్ చేస్తుంది.


Click it and Unblock the Notifications