Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో రైతు భరోసా..!
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తోంది. ఈ పథకంలో భాగంగా ఎకరాకు రూ.12 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. సీజన్ కు రూ.6 వేలు చొప్పున సంవత్సరానికి ఎకరాకు రూ.12 వేలు అందిస్తోంది. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా అమలు చేస్తోంది. ఈ సంవత్సరానికి సంబంధించి రైతు భరోసా ఒక సీజన్ పూర్తయింది.
వర్షకాల సీజన్ కు సంబంధించి రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇందుకోసం రూ.8 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. అయితే ఇప్పుడు యాసంగి సీజన్ ప్రారంభం అయింది. దీంతో అన్నదాతలు యాసంగి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తోంది. ఈసారి ఎల్ నినో ప్రభావం వల్ల యాసంగిలో సాగు భారీగా తగ్గే అవకాశం ఉంది. దీంతో రైతు భరోసా వస్తుందా రాదా అని రైతులు ఆందోళనలో ఉన్నారు. సాగు చేసిన భూమికే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే చాలా మందికి రైతు భరోసా అందదని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాపై మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈసారి ఎల్ నినో ప్రభావం వర్షాలు కురవలేదని రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని.. రైతులు భూమి సాగు చేసినా చేయకున్నా రైతు భరోసా ఇవ్వాలని సీఎం మంత్రులతో అన్నట్లు తెలుస్తోంది.

అంతే కాదు యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధులు సిద్దం చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో యాసంగి రైతు భరోసాకు సంబంధించి చర్చించినట్లు తెలుస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. అందుకే రైతు భరోసాకు నిధుల కొరత రాకుండా చూసుకోవాలని చెప్పారట. వ్యవసాయ, ఆర్థిక శాఖలు సమన్వయంతో సకాలంలో లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసేలా కసరత్తు ప్రారంభించాలని సీఎం సూచించినట్లు ఓ దినపత్రిలో వచ్చింది. అయితే ఆ డబ్బును పెట్టుబడి సాయంగా గానీ, కరువు కాలంలో ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం భారీగా తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు అడుగంటడంతో ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే పరిస్థితి ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. యాసంగిలో రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో కూడా పంటలు సాగయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. సాగు తగ్గినా వర్షకాలం సీజన్ ఎంత భూమికి రైతు భరోసా ఇచ్చామో అంతే భూమికి ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా.. వానాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.48 కోట్ల ఎకరాలకు, 70.40 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.8,759 కోట్ల రైతు భరోసా జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications