అమెరికా పౌరుల ఉద్యోగాలను పరిరక్షించేందుకు తాత్కాలికంగా వలసలను నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని ఎంతకాలం అమలు చేయనున్నారో ఆయన వెల్లడించారు. 60 రోజుల పాటు చట్టబద్దమైన శాశ్వత నివాసం లేదా గ్రీన్ కార్డును ఇవ్వడం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ చర్య తాత్కాలిక ప్రాతిపదికన వచ్చే వారిపై ప్రభావం చూపదన్నారు.

స్థానికులకే ఉద్యోగం లక్ష్యం
అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న అనంతరం స్థానిక పౌరులకే ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. అమెరికాలో నిరుద్యోగ యువతకు లాభం ఉండాలంటే వలసలను నిలిపివేయాలని నిర్ణయించామని, ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తర్వాత ఉద్యోగాల్లో వారికే ప్రాధాన్యత ఇవ్వడమే తమ లక్ష్యమని ట్రంప్ చెప్పారు. వారికే తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు.

ఆ తర్వాత సమీక్షించాక..
వైరస్ విజృంభణ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారి స్థానంలో వలస వచ్చిన వారిని చేర్చుకోవడం వల్ల ఇక్కడి వారికి అన్యాయం చేసినట్లు అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. తమ దేశ పౌరుల సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యమని తేల్చి చెప్పారు. ఈ నిషేధం 60 రోజుల పాటు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని సమీక్షించి నిర్ణయిస్తామన్నారు.

అమెరికన్ ఇండియన్స్ పైన ప్రభావం
గ్రీన్ కార్డు ఇష్యూ జారీని 60 రోజుల పాటు నిలిపివేయడంతో అమెరికాలో ఉన్న ఇండియన్-అమెరికన్లపై ప్రభావం పడుతుంది. ఈ నిర్ణయం వల్ల హెచ్1బీ వంటి వర్క్ వీసా కలిగిన వారు, వ్యవసాయ ప్రయోజనాల కోసం వచ్చే ఇమ్మిగ్రెంట్స్ పైన ప్రభావం చూపదని చెబుతున్నారు. కానీ గ్రీన్ కార్డు కోసం వేచి చూసే పదులు లేదా వేల సంఖ్యలోని ఇండియన్ అమెరికన్లపై ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం 60 రోజుల పాటు నిలిపివేసినా తర్వాత పొడిగించవచ్చుననే సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే కచ్చితంగా పొడిగిస్తామని చెప్పలేదు. ఈ ఆర్డర్స్ శాశ్వత నివాసం కోరుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని, తాత్కాలిక ప్రాతిపదికన వచ్చే వారికి వర్తించదన్నారు. అయితే వైరస్ పోరులో ఉన్న వైద్య సిబ్బంది, ఆహార సరఫరా విభాగంలో పని చేసే విదేశీయులకు నిషేధం నుండి మినహాయింపు ఇచ్చే అవకాశముంది.


Click it and Unblock the Notifications