భారత్‌లో బతకాలంటే రూ. 9 కోట్లు ఉన్నా సరిపోవు.. సోషల్ మీడియాలో ఎన్నారై పోస్ట్ మీద హాట్ డిబేట్..
Is India Becoming Too Expensive? ఒక మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 9.4 కోట్ల నికర ఆస్తి (Net Worth) ఉంటే భారతదేశంలో అత్యంత విలాసవంతమైన, హాయిగా సాగే జీవితాన్ని గడపవచ్చని చాలామంది భావిస్తుంటారు. కానీ, దశాబ్ద కాలం తర్వాత 30 రోజుల పర్యటన కోసం స్వదేశానికి తిరిగి వచ్చిన ఒక ప్రవాస భారతీయుడు (NRI) తన అనుభవాన్ని పంచుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి.
2016లో విదేశాలకు వెళ్లిన సదరు ఎన్నారై, తన భారత పర్యటన చివరి రోజున ప్రముఖ సామాజిక మాధ్యమం రెడ్డిట్‌లోని (Reddit) 'r/returnToIndia' వేదికపై కఠినమైన వాస్తవం అనే శీర్షికతో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. భారతదేశంలో ధనవంతుడిగా భావించడానికి రూ. 9.4 కోట్లు ఏమాత్రం సరిపోవని.. టైర్-3 నగరంలో కూడా రోజువారీ ఖర్చులు ఆకాశాన్నంటాయని ఆయన పేర్కొనడం తీవ్ర చర్చకు దారితీసింది.

తాను 2016లో దేశం విడిచి వెళ్లినప్పటి పరిస్థితులకు, నేటి వాస్తవాలకు మధ్య భారీ అంతరం ఉందని.. గడిచిన పదేళ్లలో భారత్‌లో వచ్చిన మార్పులకు అనుగుణంగా తమ అంచనాలు అప్‌డేట్ కాలేదని ఆ ఎన్నారై అభిప్రాయపడ్డారు. ఒక మిలియన్ డాలర్ల నికర ఆస్తి చాలా గొప్పదని నేను అనుకున్నాను, కానీ నన్ను నమ్మండి-ఇక్కడ మీరు చాలా పేదవారు. నేను ఒక టైర్-3 నగరంలో ఉన్నాను, ఇక్కడ ప్రతీదీ విపరీతంగా ఖరీదైనదిగా మారింది, డబ్బు తన విలువను కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రూ. 3-5 వేలకు దొరికే దేశీయ విమాన టిక్కెట్లు ఇప్పుడు సులభంగా రూ. 10-12 వేలు పలుకుతున్నాయని ఉదాహరణగా చూపారు.
ఆర్థిక అంశాలతో పాటు దేశంలోని మౌలిక సదుపాయాలు, పౌర స్పృహ, సామాజిక సంబంధాలపైనా ఆ ఎన్నారై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రద్దీ, పరిశుభ్రత లోపం, స్వచ్ఛమైన గాలి కరువవడం, పాదచారులకు అనుకూలమైన నడక దారులు లేకపోవడం వల్ల సాధారణ జీవనం కూడా కష్టంగా మారిందని వాపోయారు. అంతేకాకుండా, భారతీయ సమాజం పూర్తిగా పాశ్చాత్యీకరించబడిందని, ప్రజల మధ్య ఆత్మీయ సంబంధాలు తగ్గిపోయి ప్రతి ఒక్కరూ ఎదుటివారి నుండి డబ్బు సంపాదించడం లేదా మోసం చేయడమే లక్ష్యంగా చూస్తున్నారని ఆరోపించారు.
కొత్త స్నేహాలు ఏర్పరచుకోవడం ఎంతో కష్టంగా మారిందన్నారు. అయితే, ఈ పర్యటనలో తనకు నచ్చిన మంచి విషయాలను కూడా ఆయన ప్రస్తావించారు. బ్లింకిట్ (Blinkit) వంటి క్విక్ కామర్స్ సేవలు, మంచి హోటళ్లు, రుచికరమైన ఆహారం, తల్లిదండ్రులను కౌగిలించుకుని మనస్ఫూర్తిగా నవ్వగలగడం వంటివి ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని తెలిపారు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు, ముఖ్యంగా భారత్‌లో నివసిస్తున్న రెడ్డిట్ యూజర్లు ఆ ఎన్నారై వాదనపై భిన్న రకాలుగా స్పందించారు. రూ. 9.4 కోట్లు ఉన్న వ్యక్తి తనను తాను పేదవాడిగా భావించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఒక టైర్-3 నగరంలో రూ. 10 కోట్లు ఉండి కూడా పేదవాడిగా అనిపిస్తోందంటే అది డబ్బు సమస్య కాదు, ఇంగితజ్ఞానానికి సంబంధించిన సమస్య. ఆ మొత్తాన్ని తెలివిగా పెట్టుబడి పెడితే జీవితాంతం విలాసవంతంగా రిటైర్‌మెంట్ జీవితాన్ని గడపవచ్చని ఒక యూజర్ ఘాటుగా బదులిచ్చారు. సాధారణ, హుందా అయిన జీవితానికి ఆ సంపద ఎంతో ఎక్కువని, కానీ అపరిమిత విలాసాల వెంట పడితే ఎంత డబ్బైనా కరిగిపోతుందని మరొకరు హితవు పలికారు. కొందరైతే ఆ మొత్తంతో థాయ్‌లాండ్ వంటి దేశాల్లో స్థిరపడి డివిడెండ్ల మీద పాశ్చాత్య స్థాయి జీవనం గడపవచ్చని సూచించారు.
మరోవైపు ఆ ఎన్నారై లేవనెత్తిన ద్రవ్యోల్బణం, ట్రాఫిక్, పౌర స్పృహ వంటి అంశాలతో కొందరు నెటిజన్లు ఏకీభవించారు. దేశంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం వల్ల కొన్నేళ్ల విరామం తర్వాత వచ్చేవారికి ధరలు షాక్ ఇస్తాయని.. అదే సమయంలో దేశీయంగా కొన్ని రంగాల్లో వేతనాలు కూడా భారీగా పెరిగాయని విశ్లేషించారు. పౌర స్పృహ లోపించడం, అపరిశుభ్రత మరియు సామాజిక ఒత్తిళ్ల వల్ల నిజమైన స్నేహాలు దొరకడం కష్టమవుతోందన్న మాట వాస్తవమేనని పలువురు అంగీకరించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
