LIC IPO: కొద్దిరోజుల ముందు కీలక పరిణామం
ముంబై: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఇంకొద్ది రోజుల్లో ప్రైవేటుపరం కాబోతోంది. దీనికి సంబంధించిన కసరత్తు దాదాపు ముగింపుదశకు వచ్చేసింది. మార్చి తొలి వారంలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. ఎల్ఐసీలో తనకు ఉన్న వాటాలో కొంత శాతాన్ని కేంద్ర ప్రభుత్వం లిక్విడేట్ చేయనుంది. ఏ ప్రైవేట్ కంపెనీ అయినా పబ్లిక్ ఇష్యూను జారీ చేయాలంటే- సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది.
దీనికోసం డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌ను సెబికి అందజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాస్పెక్టస్‌ను రూపొందించే పనిలో పడింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. కాగా- పబ్లిక్ ఇష్యూను జారీ చేయడానికి సన్నాహాలు కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్ఐసీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ పాలసీ ఇష్యూ కంపెనీ పాలసీ బజార్ డాట్ కామ్‌తో ఓ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది ఎల్ఐసీ. ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ అగ్రిగేటర్‌తో ఎల్ఐసీ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

టర్మ్ అండ్ ఇన్వెస్టిమెంట్ పాలసీలను వినియోగదారులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పాలసీబజార్ డాట్ కామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సర్వీర్ సింగ్ తెలిపారు. ఎల్ఐసీకి సంబంధించిన అన్ని రకాల పాలసీలు ఇక తమ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. పాలసీ చెల్లింపుదారులకు తమ సేవలను వినియోగించుకోవచ్చని అన్నారు. చిన్నస్థాయి పట్టణాలకు కూడా తమ సేవలను విస్తరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.
పాలసీబజార్-ఎల్ఐసీ మధ్య ఒప్పందం కుదరడం వల్ల వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు అందుతాయని వ్యాఖ్యానించారు. ఇన్సూరెన్స్ సెగ్మెంట్‌లో బిగ్ షాట్.. తమతో టైఅప్ కావడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. పాలసీ బజార్ డాట్ కామ్ కంపెనీని ఎఫ్‌బీ ఫిన్‌టెక్ ప్రమోట్ చేస్తోన్న విషయం తెలిసిందే. దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లాట్‌ఫామ్‌గా కొనసాగుతోంది. గత ఏడాది పబ్లిక్ ఇష్యూను కూడా జారీ చేసింది.
51 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పాలసీ బజార్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పుడు తాజాగా ఎల్ఐసీతోనూ అగ్రిమెంట్ చేసుకుంది. లైఫ్, జనరల్, స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్‌ల సెగ్మెంట్‌లో రాణిస్తోంది. మరోవంక- ఎల్ఐసీ ప్రైవేటీకరణ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. 35 లక్షల కోట్ల రూపాయలుగా ఈ సంస్థ వాల్యుయేషన్‌ను కేంద్ర ప్రభుత్వం తగ్గించి చూపించిందనే అభిప్రాయాలు ఉన్నాయి. వాల్యుయేషన్‌ను 15 లక్షల కోట్ల రూపాయలుగా చూపింది కేంద్రం.


Click it and Unblock the Notifications