Reliance Capital: ధీరూభాయ్ అంబానీ కుమారుల్లో ముఖేష్ విజయవంతంగా తన ప్రస్థానం కొనసాగిస్తున్నారు. అయితే మరో బిడ్డ అనిల్ పరిస్థితి మాత్రం పాతాళానికి దిగజారి పోయింది. తాజాగా బీమా నియంత్రణ సంస్థ IRDAI ఆయనకు షాక్ ఇచ్చింది. రిలయన్స్ క్యాపిటల్‌పై కీలక నిర్ణయం తీసుకుంది.
రిలయన్స్ క్యాపిటల్ టేకోవర్‌కు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI) ఆమోదం తెలిపింది. దివాళా ప్రక్రియ ద్వారా హిందూజా గ్రూప్‌కు చెందిన ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్(IIHL) దాన్ని అధీనంలోకి తీసుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మరియు రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్‌లు ప్రభావితం కానున్నాయి.

'అక్షయ తృతీయ సందర్భంగా శుభవార్త విన్నాం. IRDAI నుంచి మే 10 2024న ఆమోదం పొందినందుకు సంతోషిస్తున్నాము. అయితే ఇది కొన్ని నియంత్రణ, చట్టబద్ధమైన మరియు న్యాయపరమైన అనుమతులు/అనుకూలతలకు లోబడి ఉంటుంది. వాటికి ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ కట్టుబడి ఉంది. వీలైనంత త్వరగా దాన్ని పొందే దిశగా పని చేస్తున్నాం. NCLT నిర్దేశించిన మే 27 2024 నాటికి ఈ లావాదేవీని ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము' అని IIHL ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెందిన సుమారు 5 కోట్ల షేర్లను రిలయన్స్ క్యాపిటల్ నుంచి హిందుజా యాజమాన్యంలోని ఆసియా ఎంటర్‌ప్రైజెస్‌కి బదిలీ చేసేందుకు IRDAI అనుమతించింది. అయితే హిందూజా గ్రూప్ కనీసం 3 సంవత్సరాల పాటు ప్రమోటర్‌గా ఉండాల్సి ఉంటుందని సమాచారం. దీనితో పాటు బీమా కంపెనీల రిజిస్ట్రేషన్, షేర్ల బదిలీ, మూలధన నిర్వహణ వంటి బాధ్యతలకు కట్టుబడి ఉండాలని IRDAI సూచించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications