క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్‌కు సంబంధించి ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయర్స్ అరెస్టయ్యారు. బెంగళూరు నార్త్ ఈస్ట్ సీఈఎన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అధికారులు కిరణ్ భరతేష్, ఆర్షత్ మోహినుద్దీన్‌లను అదుపులోకి తీసుకున్నారు. బెళగావి జిల్లా రాయ్‌బాగ్ తాలుకాలోని గ్రామం నుండి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరుద్దరు కాలేజీ విద్యార్థుల ద్వారా రూ.26,230 క్రిప్టో ఫ్రాడ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
భరతేష్, మోహినుద్దీన్‌లు అదే గ్రామానికి చెందిన పంతొమ్మిదేళ్ల యువకుడికి క్రిప్టోలో తక్షణ లాభాలు ఇస్తామని చెప్పి పెట్టుబడి పెట్టేలా చేశారు. లాభం కాదు కదా, అసలు అతను పెట్టిన పెట్టుబడి కూడా పోయింది. దీంతో సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నార్త్ ఈస్ట్ సీఈఎన్ క్రైమ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ రామ్ ఆర్ నేతృత్వంలో దర్యాఫ్తు చేశారు.

వీరిద్దరు వేర్వేరు పేర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు తెరిచారని, దాదాపు 10,000 మంది ఫాలోవర్లు ఉన్నారని గుర్తించారు. ప్రతి ప్రొఫైల్ ఖాతాదారుని యంగెస్ట్ క్రిప్టో ట్రేడర్‌గా గుర్తించాయి. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలని కోరడంతో పాటు పది నిమిషాల నుండి అరగంటలో అరవై శాతం, 400 శాతం రాబడి హామీని ఇచ్చాయి.
నకిలీ ఖాతాల ద్వారా క్రిప్టోలో పెట్టుబడులు పెట్టి, అధిక రాబడులు వస్తాయని నమ్మించే ప్రయత్నం చేశారు. వీరికి ఉన్న ఫాలోయింగ్, ఫీడ్ బ్యాక్ కస్టమర్లను ఆకర్షించింది. పెట్టుబడిదారులు రూ.2వేల నుండి రూ.50వేల వరకు పెట్టారు. తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వారు పోలీసుల వద్దకు వెళ్లలేదు. మోసం చేసిన డబ్బు నుండి ఇద్దరు ఐఫోన్ కొనుగోలు చేశారు. రెండు బ్యాంకు ఖాతాల్లో రూ.40,000 పెట్టుకున్నారు. వారు సమీకరించిన మొత్తాన్ని బ్రాండ్ ఫ్యాషన్, పార్టీలకు ఖర్చు చేశారు.


Click it and Unblock the Notifications