గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ దిగ్గజం ఇన్పోసిస్‌లో మధ్యస్థాయి, అసోసియేట్ స్థాయి ఉద్యోగులు పెరిగినప్పటికీ, టాప్ లెవల్, సీనియర్ లెవల్ ఉద్యోగుల సంఖ్య తగ్గిందట. వ్యయ నియంత్రణలో భాగంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని నియమించుకునే వ్యూహాన్ని అనుసరిస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలోను సీనియర్లు తగ్గనున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

వారు తగ్గారు.. వీరు పెరిగారు
2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ కంపెనీలో ఉన్నతస్థాయి ఉద్యోగుల సంఖ్య 5 శాతం తగ్గి 926కి పడిపోయినట్లు కంపెనీ తాజా నివేదికలో వెల్లడించింది. ఇదే కాలంలో సీనియర్ లెవల్ ఉద్యోగుల సంఖ్య 30,013కు తగ్గింది. అదే సమయంలో మధ్యస్థాయి ఉద్యోగుల సంఖ్య 4 శాతం పెరిగి 1,15,277కు చేరుకుంది. అసోసియేట్ లెవల్ ఉద్యోగుల సంఖ్య 9 శాతం పెరిగి 94,584కు చేరుకుంది.

వ్యయ నియంత్రణ కోసం..
గత ఆర్థిక సంవత్సరం ఇన్ఫోసిస్ 100 మిలియన్ డాలర్ల నుండి 150 మిలియన్ డాలర్ల మేర ఖర్చులు తగ్గించాలని భావించింది. వ్యయాలు తగ్గించుకునే క్రమంలో భాగంగా ప్రెషర్స్ హైరింగ్, మిడిల్, సీనియర్ ఉద్యోగుల పాత్రల్లో మార్పులు చేసింది. గత ఆర్థిక సంవత్సరానికి భిన్నంగా, 2017-18తో పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఉన్నత ఉద్యోగులు, సీనియర్ అండ్ మిడిల్ లెవల్ ఉద్యోగుల పెరగడం గమనార్హం.

ఉద్యోగుల సంఖ్యలో పెరుగుదల.. తగ్గుదల
2018తో పోలిస్తే 2019 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌లో టాప్ లెవల్ ఉద్యోగులు 7 శాతం, సీనియర్ లెవల్ ఉద్యోగులు 11 శాతం, మిడిల్ లెవల్ ఉద్యోగులు 25 శాతం పెరిగారు. అసోసియేట్ లెవల్ ఉద్యోగుల సంఖ్య మాత్రం 2 శాతం తగ్గింది. అమెరికాలో పేరోల్‌లో ఉన్న ఉద్యోగుల సంఖ్య 17,709గా ఉంది. గత ఏడాది ఈ ఉద్యోగుల సంఖ్య 13 శాతం పెరిగింది. 2018తో పోలిస్తే 2019లో 74 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications