బీజింగ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రారంభమైన యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. మూడోరోజు మరింత ఉధృతమైంది. రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టాయి. అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ భవనాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. వారి దూకుడును ఉక్రెయిన్ ఆర్మీ.. ఎక్కడికక్కడు అడ్డుకుంటోంది. తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. కీవ్‌ను సొంతం చేసుకోవడానికి రష్యా సైనికులు చేస్తోన్న ప్రయత్నాలను విఫలం చేస్తోంది. ఈ రెండు దేశాల సైన్యం మధ్య పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతోంది.
సైన్యం సంఖ్య తక్కువగా ఉండటం, పొరుగు దేశాలేవీ తనతో కలిసి యుద్ధంలో పాల్గొనడానికి ముందుకు రాకపోవడంతో ఉక్రెయిన్ ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో ఉంది. తమ దేశంపై దండెత్తి వచ్చిన రష్యన్ సైనికులను నిలువరించడానికి సాధారణ పౌరులను సైతం ఉక్రెయిన్.. సైన్యంలోకి చేర్చుకుంది. వారికి ఆయుధాలను అప్పగించింది. ఆయుధాలను చేతబట్టుకున్న ఉక్రెయిన్ పౌరులు.. ప్రత్యేకించి యువకులు- రాజధాని కీవ్‌లో తిరుగాడుతున్నారు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి వెనుకాడట్లేదు. మడమ తిప్పని పోరాటానికి సిద్ధపడ్డారు.
దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్- సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్నాయి. వైరల్‌గా మారాయి. బలమైన రష్యన్ సైనికులను తరిమికొట్టడానికి ఉక్రెయిన్ పౌరులు కదనరంగంలో కాలుపెట్టడాన్ని నెటిజర్లు స్పందించారు. వారి దేశభక్తిని కీర్తిస్తోన్నారు. దేశం అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- సాధారణ పౌరులు సైతం తామున్నామంటూ ముందుకు రావడం గొప్ప విషయమని ప్రశంసిస్తోన్నారు. ప్రతి ఒక్క పౌరుడు తమ దేశ భక్తిని చాటుకోవడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి రాదని వ్యాఖ్యానిస్తోన్నారు.

ఉక్రెయిన్ పౌరుల దేశభక్తిని కీర్తించిన వారిలో దేశీయ పారిశ్రామిక దిగ్గజం, మహీంద్ర గ్రూప్ ఆఫ్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర కూడా ఉన్నారు. ఉక్రెయిన్ పౌరులను ప్రశంసించారు. తమ దేశాన్ని తాము కాపాడుకోవడానికి పౌరులు ముందుకొచ్చినప్పుడు- ఆ శక్తిని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. న్యూక్లియర్ ఆయుధాల కంటే అత్యంత శక్తిమంతమైన బలగాలుగా ఆ దేశ పౌరులు నిలుస్తారని పేర్కొన్నారు. పౌరులు అండగా నిలిచిన దేశంలో చొరబడటం సులభమే అయినప్పటికీ- దాన్ని ఆక్రమించడం అసాధ్యమని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications