చెన్నై నుంచి ముంబైకి వెళ్లాల్సిన ప్రయాణికులకు ఇండిగో అకస్మాత్తుగా ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. దీనిపై Pops KV Sridhar అనే ప్రయాణికుడి అనుభవం సోషల్ మీడియాను కుదిపేసింది. అతను చెన్నై (MAA) నుంచి ముంబై (BOM)కి ప్రయాణించాల్సి వచ్చింది. ఇండిగో విమానం చివరి నిమిషంలో రద్దు కావడంతో.. అతను మరో ప్రత్యామ్నాయాన్ని వెతకడం తప్ప వేరే ఆప్షన్ లేకపోయింది. మధ్యరాత్రి జరిగిన రద్దు నిర్ణయం వల్ల అందుబాటులో ఉన్న ఇతర విమానాల అవకాశాలు కూడా పూర్తిగా లేకపోయాయి.
ఎంపికల కోసం తీవ్రంగా వెతికిన అతను చివరికి 6:15 AMకి ఉన్న ఒకే ఒక్క విమానాన్ని కనుగొన్నాడు. అయితే ఆ టికెట్ ధరను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.దాని రూ. 34,231కు పైగా ఉంది. రోజంతా ఉన్న మిగతా విమానాల ధరలూ రూ. 45 వేలకు పైగానే ఉన్నాయి. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే బిజినెస్ క్లాస్ ఛార్జ్ చూడగా రూ. 1,16,000 చూపించింది. సాధారణంగా రూ.8 వేల నుండి రూ. 12వేల మధ్య ఉండే ముంబై-చెన్నై టికెట్ ధర ఈ స్థాయిలో ఉండటం చూసి ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఇండిగో ముందుగానే ప్రయాణికులకు హెచ్చరిక ఇవ్వాల్సింది. ప్రయాణ ప్రణాళికను మార్చుకోవడానికి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రయాణికులకు కొంచెం అవకాశం ఉండేది. కానీ అలా చేయకుండా, వేల మంది ప్రయాణికులను కఠిన పరిస్థితిలో పడవేయడం తీవ్రమైన తప్పిదం అని సోషల్ మీడియాలో వినిపించిన విమర్శలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఎయిర్ ఇండియా చేసిన సర్జ్ ప్రైసింగ్ కూడా ప్రయాణికుల ఆగ్రహానికి కారణమైంది. అత్యవసర పరిస్థితిని అవకాశంగా మార్చుకుని టికెట్ ధరలను రెట్టింపు చేయడం విమానయాన రంగంలో నైతికత అనే అంశంపై పెద్ద చర్చకు దారితీసింది.
ఇందులో అత్యంత నిరాశ కలిగించిన అంశం ఏంటంటే.. ప్రయాణికులు భారీ కష్టాలు పడుతున్నప్పటికీ, ప్రభుత్వం కేవలం "పరిశీలిస్తున్నాం" అనే ధోరణిలో ఉండిపోవడం. ప్రయాణికుడు తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నాడు:
"IndiGo could have warned passengers, and Air India could have avoided surge pricing in such an extraordinary situation. Both brands took a beating, and the Aviation Ministry was as lame a spectator as any of us."
ఈ పరిస్థితి తెలిపేది ఏమిటంటే, భారత్‌లో విమానయాన రంగంలో బలమైన నిబంధనలు, అత్యవసర నిర్వహణ వ్యవస్థ, ప్రయాణికుల రక్షణ చట్టాలు ఇంకా లేవు అన్న వాస్తవం. అకస్మాత్తుగా విమానాలు రద్దు అయితే రీఫండ్ తప్ప మరే మార్గం ప్రయాణికులకు ఉండకపోవడం, ఇతర ఎయిర్‌లైన్లు ఈ అవకాశాన్ని సర్జ్ ప్రైసింగ్ ద్వారా లాభాల్లోకి మార్చుకోవడం చాలా బాధాకరం. ఇండిగో సంక్షోభంతో ప్రారంభమైన ఈ సమస్య దేశ వ్యాప్తంగా ప్రయాణికులకు ఓ అనుభవం అయింది. ఈ సంఘటన ఇప్పుడు విమానయాన రంగం నిబంధనలు మారాలనే డిమాండ్‌ను బలంగా వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications