మోడీ సంస్కరణలతో.. మందగమనం తాత్కాలికమే: ముఖేష్ అంబానీ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ రానున్న రోజుల్లో పుంజుకుంటుందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న ఉద్దీపణ చర్యలు రాబోయే త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేస్తాయని ముఖేష్ ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక మందగమనం తాత్కాలికమే అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు, చర్యలతో ఆర్థిక వ్యవస్థ త్వరలోనే మళ్లీ పరుగులు తీస్తుందన్నారు.
సౌదీ అరేబియాలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో ఆయన మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు. ఇటీవల భారత ఆర్థిక వృద్ధిరేటు కొద్దిగా మందగించిందని, అయితే ఇది తాత్కాలికమేనన్నది తన అభిప్రాయమన్నారు. ప్రస్తుతం బలమైన నాయకత్వాల పాలనలో ఉండడమే భారత్, సౌదీ అరేబియా దేశాలకు ఉన్న ప్రధాన బలమని చెప్పారు. టెక్నాలజీ, జనాభాలో ఎక్కువ మంది పని చేసే యువకులు కావడం ఈ రెండు దేశాలకు కలిసి వచ్చే అంశమన్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనింగ్, పెట్రో రసాయనాల వ్యాపారంలో 20% వాటా ఇన్వెస్ట్ చేసేందుకు సౌదీ ఆరామ్ కో కంపెనీతో అంగీకారం కుదిరింది. దీనిపై మరిన్ని చర్చలు జరిపేందుకు ముఖేష్ అంబానీ సౌదీ అరేబియాలో పెట్టుబడుల సదస్సుకు హాజరయ్యారు.
పెట్టుబడులు, వినియోగం, డిమాండ్ పడిపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు గత ఆరేళ్లలో ఎన్నడూ లేని విధంగా 5% పడిపోయింది. అంతేకాకుండా IMF, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారత జీడీపీ వృద్ధిరేటు అంచనాను తగ్గించాయి. వృద్ధి రేటును గాడిలో పెట్టేందుకు మోడీ ప్రభుత్వం ఇటీవల కార్పోరేట్ పన్ను తగ్గించడం సహా వివిధ ఉద్దీపన చర్యలు ప్రకటించింది.
మరోవైపు, దీపావళి పండుగ సందర్భంగా మహీంద్రా సేల్స్ బాగున్నాయి. సేల్స్‌లో డబుల్ డిజిట్ గ్రోత్ సాధించింది. దీపావళి సందర్భంగా సేల్స్ భారీగా పెరిగాయని, ప్రభుత్వం ఉద్దీపనల నేపథ్యంలో ముందు ముందు మరింత బాగుంటుందని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. విదేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు భారత్‌కు కలిసి వస్తాయన్నారు.


Click it and Unblock the Notifications