రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు ఇవిగో..
Indian Railways Expansion: దేశవ్యాప్తంగా రైలు అనుసంధానాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రయాణీకుల, సరుకుల రవాణా సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం బృహత్తర అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) బుధవారం రోజున తొమ్మిది రాష్ట్రాల వ్యాప్తంగా రూ. 20,804 కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది ప్రధాన రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దాదాపు 1,196 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుత కీలక రైలు మార్గాలలో రద్దీ గణనీయంగా తగ్గి, సరుకులు, ప్రయాణికుల రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టులన్నింటినీ 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
ఆమోదించిన ఎనిమిది ప్రాజెక్టులలో రూ. 10,021 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులు దక్షిణ-మధ్య భారతదేశంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో 540 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. వీటిలో అరక్కోణం-రేణిగుంట మధ్య 77 కిలోమీటర్ల 3వ, 4వ లైన్లు, వైట్‌ఫీల్డ్-బంగారపేట మధ్య 47 కిలోమీటర్ల 3వ, 4వ లైన్లు, హోసూర్-ఓమలూర్ మధ్య 147 కిలోమీటర్ల డబ్లింగ్, సేలం-కరూర్-దిండిగల్ మధ్య 159 కిలోమీటర్ల డబ్లింగ్, సికింద్రాబాద్ (ఘట్‌కేసర్)-కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ఐదు ప్రాజెక్టులు 17 జిల్లాల గుండా వెళుతూ.. 2,121 గ్రామాలకు ప్రత్యక్ష అనుసంధానాన్ని కల్పిస్తాయి. దీనివల్ల దాదాపు 52 లక్షల మంది ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.

మరోవైపు రూ. 10,783 కోట్ల అంచనా వ్యయంతో కూడిన మిగిలిన మూడు ప్రాజెక్టులు తూర్పు, మధ్య భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో 656 కిలోమీటర్ల మేర విస్తరించనున్నాయి. వీటిలో ఖరగ్‌పూర్-ఝర్సుగూడ (బాగ్దేహి) మార్గంలో నాల్గవ లైన్, కట్ని-పేంద్ర రోడ్ మార్గంలో నాల్గవ లైన్, బిలాస్‌పూర్ (ఉస్లాపూర్)-పెండ్రా రోడ్ మధ్య మూడో లైన్ నిర్మాణ పనులు ఉన్నాయి. ఈ మూడు ప్రాజెక్టులు 14 జిల్లాలను కవర్ చేస్తూ.. సుమారు 56 లక్షల జనాభా కలిగిన 4,790 గ్రామాలకు రైల్వే నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెస్తాయి.
ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద అమలు కానున్న ఈ మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు అన్నీ కలిసి ఏటా సుమారు 74 మిలియన్ టన్నుల (MTPA) అదనపు సరుకు రవాణా సామర్థ్యాన్ని వ్యవస్థకు జోడిస్తాయి. కొత్తగా విస్తరించే ఈ మార్గాలు దేశీయంగా బొగ్గు, సిమెంట్, ఇనుము, ఉక్కు, కంటైనర్లు, ఆటోమొబైల్స్, ఆహార ధాన్యాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల రవాణాను అత్యంత వేగవంతం చేస్తాయి.
ఇవే కాకుండా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతితో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలకు అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. పర్యావరణపరంగా కూడా ఈ ప్రాజెక్టులు ఎంతో మేలు చేకూర్చనున్నాయి. రైలు రవాణా పెరుగుదల వల్ల చమురు దిగుమతులు సుమారు 20 కోట్ల లీటర్లు తగ్గడంతో పాటు, దాదాపు 104 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని అంచనా వేశారు. ఈ ఉద్గారాల తగ్గింపు అనేది సుమారు 4.48 కోట్ల చెట్లు వాతావరణం నుండి బొగ్గుపులుసు వాయువును పీల్చుకునే సామర్థ్యంతో సమానమని ప్రభుత్వం వెల్లడించింది.


Click it and Unblock the Notifications

