Koo Layoffs: ఇప్పటి వరకు ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని అమెరికా దిగ్గజ మైక్రోబ్లాగర్ ట్విట్టర్ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి దీని భారత పోటీదారైన Kooకి కూడా వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. దాదాపు మూడేళ్ల కిందట ప్రారంభమైన భారతీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ కష్టాలను ఎదుర్కొంటోంది. ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో నష్టాలు, నిధులు సేకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో చేసేది లేక మూడో వంతు మంది ఉద్యోగులను తొలగించింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 260 మంది ప్రభావితమైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం గ్లోబల్ సెంటిమెంట్ వృద్ధి కంటే సామర్థ్యంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుందని కూ ప్రతినిధి బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థకు వెల్లడించారు. అయితే ప్రస్తుతం తొలగించబడిన ఉద్యోగులకు పరిహారం ప్యాకేజీతో పాటు, ఆరోగ్య ప్రయోజనాలు, కొత్త ఉద్యోగం కనుగొనేందుకు సహాయానికి కంపెనీ మద్దతునిస్తోంది. సవాళ్లున్న పరిస్థితుల్లో సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగాలని ఈ భారతీయ సంస్థ భావిస్తోంది.
గత సంవత్సరం ట్విట్టర్ కంపెనీని ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాక భారీ మార్పులను ప్రవేశపెట్టారు. దీంతో చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మాజీ ట్విట్టర్ ఉద్యోగులను నియమించుకోవటానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ.. Koo సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయని తెలుస్తోంది.
దేశీ మెసేజింగ్ మైక్రోబ్లాగర్ ప్రస్తుతం 6 కోట్ల డౌన్‌లోడ్‌లు ఉన్నాయని పేర్కొంది. వీలైనంత త్వరగా కంపెనీ లాభాల్లోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఇతర సోషల్ మీడియా కంపెనీల్లో ఒక యూజర్‌కి అత్యధిక ఆదాయాన్ని కలిగి ఉన్న కంపెనీ తమదేనని మయాంక్ బిదవత్కా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications