ట్రంప్ ఇమ్మిగ్రేషన్ దెబ్బ, భారీగా నష్టపోయిన ఇన్ఫీ, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ షేర్లు
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. సెన్సెక్స్ ఏకంగా 1011 పాయింట్లు పడిపోయి 30,636 వద్ద, నిఫ్టీ 280 పాయింట్లు నష్టపోయి 8,981 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్లో బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు ఏకంగా 12 శాతం పడిపోయాయి. యాక్సిస్ బ్యాంకు, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ షేర్లు నష్టపోయాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

నష్టాల్లో బ్యాంకింగ్ షేర్లు
బ్యాంకింగ్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు బ్యాంకుల రేటింగ్స్‌ను తగ్గించాయి. కరోనా కారణంగా బ్యాంకుల రుణ వృద్ధి మందగించడం, క్వాలిటీ రిస్క్‌లు పెరగడంతో టార్గెట్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 5.29% నష్టపోయింది. ఐటీ షేర్లు కూడా అదే దారిలో నడిచాయి.

5 శాతానికి పైగా నష్టపోయిన ఐటీ షేర్లు
ఐటీ కంపెనీల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ఎన్ఎస్ఈలో దాదాపు 6 శాతం నష్టపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెక్సావేర్ టెక్నాలజీస్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, మైండ్ ట్రీ షేర్లు 1 శాతం నుండి 5 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.1 శాతం మేర నష్టపోయింది.

కారణమిదే..
ఐటీ షేర్లు పడిపోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణమైంది. అదృశ్య శత్రువు కరోనా మహమ్మారి నుండి కాపాడుకునేందుకు, అలాగే, అమెరికన్ల ఉద్యోగాలను రక్షించాల్సిన అవసరం ఉన్నందున అమెరికాలోకి తాత్కాలిక వలసలను నిలిపివేస్తున్నట్లు తాను ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేస్తానని ట్రంప్ ట్వీట్ చేశారు. ట్రంప్ అమెరికా ఇమ్మిగ్రేషన్ కామెంట్స్ నేపథ్యంలో ఐటీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

ఏ షేర్ ఎంత పడిపోయిందంటే?
మార్నింగ్ డీల్స్‌లో మైండ్ ట్రీ షేర్ 6.35 శాతం పడిపోయి రూ.733.30, హెక్సావేర్ టెక్నాలజీస్ షేర్ 3.30 శాతం పడిపోయి రూ.266.75 వద్ద ట్రేడ్ అయింది. ఇన్ఫోసిస్ షేర్ 3.11 శాతం నష్టపోయి 633 వద్ద, విప్రో షేర్ 1.55 నష్టపోయి 178.30 వద్ద, టీసీఎస్ షేర్ 4.45 శాతం కోల్పోయి రూ.1,737.75 వద్ద, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 3.18 శాతం నష్టపోయి రూ.455 వద్ద క్లోజ్ అయింది. క్వార్టర్ 4 ఫలితాలు ప్రకటించిన అనంతరం ఇన్పోసిస్ షేర్లు ఈ రోజు పడిపోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications