Infosys News: దేశంలోని టాప్ టెక్ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌కి బిగ్ షాక్ తగిలింది. దీంతో ఐటీ కంపెనీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నమోదైంది. ఇన్వెస్టర్లు కంపెనీలో వాటాలను విక్రయించటంతో టాప్ లూజర్లలో కంపెనీ షేర్లు చేరాయి.
వివరాల్లోకి వెళితే ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.341 కోట్ల పన్ను డిమాండ్ నోటీసు అందింది. ఈ వార్త వెలుగులోకి రావటంతో ఇన్ఫోసిస్ షేర్లపై ఇన్వెస్టర్లు ఆందోళనలో ఉన్నారు. సోమవారం ఇన్ఫోసిస్ షేర్లు స్టాక్ మార్కెట్ పెరుగుదల మధ్య నష్టాల్లో ముగిశాయి. ఈ స్టాక్ దాని 52 వారాల గరిష్ఠమైన రూ.1,733 కంటే రూ.235.50 తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

2020-21 అసెస్‌మెంట్ సంవత్సరానికి రూ.341 కోట్ల పన్ను డిమాండ్‌పై ఇన్ఫోసిస్ నోటీసును అందుకుంది. మార్చి 31, 2024తో ముగిసే త్రైమాసికం, ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక నివేదికలపై ఆర్డర్ ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ ఉత్తర్వుపై అప్పీల్ దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా ఇన్ఫోసిస్ తెలిపింది. తాము మార్చి 31, 2024న ఆదాయపు పన్ను అధికారుల నుంచి 2020-21 అసెస్‌మెంట్ సంవత్సరానికి రూ.341 కోట్ల పన్ను డిమాండ్ నోటీసులను అందుకున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు దాఖలు చేసిన ఒక ఫైల్‌లో తెలిపింది.
సోమవారం నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.41 శాతం లాభంతో ముగిసింది. ఇన్ఫోసిస్‌తో సహా మొత్తం 10 స్టాక్స్‌లో 3 నష్టాల్లో ముగిశాయి. ఎంఫాసిస్‌లో 3 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో టీసీఎస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్ కూడా గ్రీన్‌లో ముగియగా.. ఎల్‌టిఐఎం, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ మాత్రం నష్టాలతో ప్రయాణాన్ని ముగించాయి. ఉదయం 10.04 గంటల సమయంలో ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు నేడు స్వల్ప నష్టంతో రూ.1,487.50 వద్ద ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications