IT Jobs: ప్లేటు పిరాయిస్తున్న టెక్ కంపెనీలు.. ఊరించి చివరికి NO అంటున్నాయి.. షాక్ లో యువ టెక్కీలు..!!
IT Jobs: మెున్నటి వరకు గుండెల మీద చెయ్యేసుకుని పడుకున్న యువత ఇప్పుడు కలవరపడుతున్నారు. ఆఫర్ లెటర్ వచ్చింది ఇంకేంటి జాబ్ లో జాయిన్ అయిపోదాం అని వేచి చూసిన వారికి కంపెనీలు షాక్ ఇస్తున్నాయి. మాంద్యం కారణంగా తలెత్తిన మందగమనంతో కంపెనీలు చేస్తున్న పని గురించి అనేక విషయాలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి.

కంపెనీల మాటలు నమ్మి..
ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని ఆఫర్ లెటర్ సైతం పొందిన యువ టెక్కీలు చాలా మంది. అలా చదువు కాగానే దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగం వచ్చిందని సంబరపడిన వారికి అది మూడునాళ్ల ముచ్చటగానే మిగిలింది. కంపెనీలో జాయిన్ కావటం కొన్నాళ్లు వాయిదా పడినా వేచి ఉన్న వారికి నిరాశ మిగిలింది. వీరిలో ఎక్కువ మంది ఫ్రెషర్స్ ఉన్నారు. విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు కొంతమంది ఫ్రెషర్ అభ్యర్థులకు ఆఫర్ లెటర్‌లు జారీ చేసిన తర్వాత దానిని రద్దు చేశాయి.

ఎందుకు రద్దు చేస్తున్నాయంటే..?
వందలాది మంది ఫ్రెషర్లకు ఐటీ కంపెనీలు లెటర్లు ఇష్యూ అయ్యాయి. ఈ అభ్యర్థులు చేరడానికి మొదట 3-4 నెలల ఆలస్యం జరిగింది. ఈ అభ్యర్థుల చేరికను కంపెనీలు వాయిదా వేసి చివరకు వారి ఆఫర్ లెటర్లు రద్దు చేసినట్లు కంపెనీలు సమాచారం అందిస్తున్నాయి. దీంతో అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అనేక రౌండ్ల ఇంటర్వ్యూ క్లియర్ చేసుకుని ఎంపికయ్యామని చివరికి కంపెనీలు ఇలా మోసం చేయటం సరికాదని వాపోతున్నారు. వేచి ఉండమని చెప్పి నెలలు గడిచిన తర్వాత నిరాకరించటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కంపెనీలు ఏమంటున్నాయంటే..
మార్గదర్శకాలను పేర్కొంటూ కంపెనీలు తమ ఆఫర్ లెటర్‌లను తిరస్కరించాయని విద్యార్థులు పేర్కొన్నారు. కంపెనీలు పంపిన మెయిల్‌లో విద్యార్థులు అకాడమీ అర్హతను పూర్తి చేయలేదని తెలిపినట్లు తెలుస్తోంది. అందువల్ల ఎంపిక రద్దు చేయబడిందని పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ తిరోగమనంలో ఉన్న తరుణంలో దేశీయ ఐటీ కంపెనీలు ఆఫర్ లెటర్లను రద్దు చేశాయన్న వార్తలు వస్తున్నాయి.

ఐటీ రంగంలో మందగమనం..
దేశంలోని, ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచిన విధానం, స్టార్టప్‌లకు నిధుల ప్రవాహం బాగా తగ్గింది. ఐటీ రంగంలో స్టార్టప్‌లకు నిధుల కొరత ప్రత్యక్ష ప్రభావం ఈ పరిశ్రమపై కనిపిస్తోంది. వడ్డీ రేట్ల పెంపు వ్యాపార వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ కూడా కొత్త రిక్రూట్‌మెంట్‌లను ప్రస్తుతానికి నిలిపివేశాయి. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. భారతీయ ఐటీ కంపెనీల విషయానికొస్తే.. ఐటీ కంపెనీలు రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నెలల తరబడి వాయిదా వేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications