IT News: టెక్ ఫ్రెషర్లకు శుభవార్త.. 50 వేల ఉద్యోగాలు.. టీంలీజ్ ఎడ్‌టెక్ నివేదిక
IT News: మారిపోతున్న టెక్నాలజీ వినియోగం, వ్యాపారాల్లో అలుముకున్న మందగమనం, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులతో టెక్ కంపెనీలు నియామకాలను స్లో చేశాయి. కానీ ఫ్రెషర్లకు మాత్రం మంచి కాలం వచ్చేసింది.
అవును ఎక్కువ జీతాలు పొందే కేటగిరీ ఉద్యోగుల కంటే ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకునేందుకు ఐటీ కంపెనీలు ఎక్కువగా మెుగ్గుచూపుతున్నాయి. దీనికి సంబంధించి ఇటీవల టీంలీజ్ ఎడ్‌టెక్ సంస్థ చేపట్టిన సర్వేలో దేశీయ ఐటీ కంపెనీలు ఆశాజనకరంగా ఉన్నట్లు వెల్లడైంది.

నివేదిక ప్రకారం ప్రధాన భారతీయ IT సంస్థలు జూలై-డిసెంబర్ 2023 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఐటీ, నాన్-ఐటీ విభాగాల్లో దాదాపు 50,000 ఖాళీలను ఫ్రెషర్ల రిక్రూట్మెంట్ ద్వారా పూరించటానికి సిద్ధమవుతున్నాయి. ఐటీ పరిశ్రమలో క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీతో పాటు ఇతర ఆత్యాధునిక సాంకేతికల ద్వారా కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని టెక్ కంపెనీలు నిర్ణయించాయి. వీటి ద్వారా వ్యాపార అభివృద్ధిని సాధించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయని నివేదిక వెల్లడించింది.
దేశవ్యాప్తంగా మెుత్తం 737 సంస్థలపై సర్వే నిర్వహించిన తర్వాత మెుత్తం 65 శాతం కంపెనీలు యువ టాలెంట్ నియామకాలపై సానుకూలంగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రధానంగా ఈ-కామర్స్ అండ్ టెక్నాలజీ, స్టార్టప్ కంపెనీలు, టెలి కమ్యూనికేషన్, ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రాక్చర్ రంగాలు యువ టాలెంట్ చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.
మార్కెట్లోకి కంపెనీలు ప్రధానంగా DevOps ఇంజనీర్, చార్టర్డ్ అకౌంటెంట్, SEO అనలిస్ట్, UX డిజైనర్ వంటి ఉద్యోగ పాత్రల కోసం ఫ్రెషర్లను అన్వేషిస్తున్నాయి. అలాగే బిజినెస్ అనలిటిక్స్, బ్లాక్‌చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఎన్‌క్రిప్షన్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, మెషిన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్ అండ్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్(SEO) నైపుణ్యాలకు మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉన్నట్లు వెల్లడైంది.


Click it and Unblock the Notifications