Unacademy Layoffs: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యపార మందగమనం వల్ల దిగ్గజ కంపెనీలు సైతం అల్లాడిపోతున్నాయి. వారి వద్ద బిలియన్ల కొద్ది డాలర్ల నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ ఖర్చుల తగ్గింపుకోసం చర్యలు చేపడుతూ ఉద్యోగులను ఇళ్లకు పంపిస్తున్నాయి. ఇదే క్రమంలో స్టార్టప్ కంపెనీల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
దేశంలోని స్టార్టప్ కంపెనీలు నిధుల కొరతను భారీగా ఎదుర్కొంటున్నాయి. ఫండింగ్ వింటర్ కారణంగా వెంచర్ క్యాపిటలిస్ట్స్ నుంచి నిధులు నిలిచిపోగా.. ఉన్న నిధులను వీలైనంత ప్రభావవంతంగా ఉపయోగించాలని స్టార్టప్ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. వీటన్నింటి కంటే ముఖ్యమైనది వ్యాపారాలను లాభదాయకతగా మార్చాలని పెట్టుబడిదారుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి కంపెనీలను కఠిన నిర్ణయాల వైపు నడుపుతున్నాయి.

ఈ క్రమంలో ఎడ్‌టెక్ స్టార్టప్ అన్‌ఎకాడమీ గురువారం మరో రౌండ్ లేఆఫ్‌లను ప్రకటించింది. తాజా రౌండ్ ద్వారా 12 శాతం మంది ఉద్యోగులను సంస్థ తగ్గించింది. తన ప్రధాన వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చేందుకు ప్రతి అడుగు సరైన దశలో వేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్నది సరిపోదని.. మరిన్ని చర్యలు అవసరమని తెలిపింది. ఈ క్రమంలో దురదృష్టవశాత్తు మరొక కష్టమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందంటూ 12 శాతం ఉద్యోగుల తొలగింపుపై కంపెనీ సహ వ్యవస్థాపకుడు గౌరవ్ ముంజాల్ నోట్ ద్వారా తెలిపారు.
గత ఏడాది కంపెనీ ఆగస్టులో 350 మందిని తొలగించింది. కరోనా సమయంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన ఆన్‌లైన్ ఎడ్‌టెక్ కంపెనీల వ్యాపారం పరిస్థితులు తిరిగి నార్మల్ కావటంతో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జూన్‌లో 150 మందిని, ఏప్రిల్ నెలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించబడిన 600 మంది ఉద్యోగులకు కూడా తొలగించింది. ఇటీవల తొలగించబడిన ఉద్యోగులకు రెండు నెలల జీతాన్ని పరిహారంగా చెల్లించటంతో పాటు ఏడాది పాటు హెల్త్ ఇన్సూరెన్స్, ప్లేస్‌మెంట్ అండ్ కెరీర్ సపోర్ట్ వంటి ప్రయోజనాలను అందించింది.


Click it and Unblock the Notifications