వృద్ధి@9.5%: 'సూపర్ ఫాస్ట్' ఇండియా, ప్రభుత్వం ఇవి చేస్తే అన్ని దేశాల కంటే ముందు
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో గతంలో ఎన్నడూ చూడని మాంద్యం అలుముకుంటోందని వివిధ రేటింగ్ ఏజెన్సీలు, పలువురు ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం భారత్ పరిస్థితి దిగజారినప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి పుంజుకుంటుందని రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. తాజాగా ఫిచ్ రేటింగ్స్ 2021-22లో భారత వృద్ధి రేటు అనూహ్యంగా పుంజుకుంటుందని పేర్కొంది.

వచ్చే ఏడాది బలంగా పుంజుకుంటుంది
ప్రస్తుత(2020-21) ఆర్థిక ఏడాదిలో భారత్ ప్రతికూల వృద్ధి నమోదవుతుందని, కానీ వచ్చే ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి బలంగా పుంజుకుంటుందని, ఏకంగా 9.5 శాతం వృద్ధి నమోదు అయ్యే అవకాశముందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. దీంతో ఆర్థిక రంగం మరింత క్షీణించకుండా ఉంటుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి 5 శాతం మేర క్షీణిస్తుందని ఇదివరకే ఫిచ్ అంచనా వేసింది. భారత వృద్ధి అంచనాలను కరోనా భారీగా బలహీనపరిచిందని పేర్కొంది.

మరింత బలహీనపడకుండా ఆదుకుంటుంది
గత ఒకటి రెండేళ్ళుగా మందగమనం కొనసాగుతోందని, దీనికితోడు ఇప్పుడు కరోనా భారత ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీస్తోందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. దీంతో జీడీపీ వృద్ధి మైనస్ 5 శాతానికి క్షీణిస్తుందని పేర్కొంది. కరోనా భారత్ వృద్ధి ధోరణిని బలహీనపరిచిందని, ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభం తర్వాత భారత జీడీపీ 'బీబీబీ' కేటగిరీలోని ఇతర దేశాల కంటే మెరుగైన స్థానానికి చేరుకుంటుందని, కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడకుండా ఇది ఆదుకుంటుందని ఏపీఏసీ సార్వభౌమ క్రెడిట్ అంచనాల పేరుతో బుధవారం విడుదల చేసిన నివేదికలో ఫిచ్ రేటింగ్స్ తెలిపింది.

ప్యాకేజీ తక్కువ.. రుణభారం..
ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పేరుతో జీడీపీలో 10 శాతం ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిందని, ఇతర దేశాలతో పోలిస్తే ఇది తక్కువ అని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది. 2019-20లో ప్రభుత్వ రుణం జీడీపీలో 70 శాతానికి చేరుకుందని, 'బీబీబీ' రేటింగ్ సగటు 42 శాతం కంటే ఇది చాలా ఎక్కువ అని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ప్రజారుణం జీడీపీలో 84 శాతానికి చేరుకుంటుందని, గత ఏడాది డిసెంబర్‌లో తాము 71 శాతం అంచనా వేయగా, ఇది ఎంతో ఎక్కువ అని తెలిపింది.

ఇవి చేస్తే.. భవిష్యత్తుపై ఆశాజనకం
ఇదిలా ఉండగా, భారత సార్వభౌమ రేటింగ్‌ను దీర్ఘకాలానికి 'బీబీబీ-'గా కొనసాగిస్తున్నట్లు మరో రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ తెలిపింది. వరుసగా 13వ ఏడాది అతి తక్కువ పెట్టుబడి గ్రేడ్‌లోనే భారత్‌ను ఉంచింది. అయితే మూడీస్ ఇటీవల రేటింగ్ తగ్గించినప్పటికీ కరోనా సంక్షోభంలో కూడా ఎస్ అండ్ పీ రేటింగ్ మార్చలేదు. వృద్ధి భయాలు పెరుగుతున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యలోటు పరిస్థితి స్థిరపడుతున్నాయని, 2021 నుండి రికవరీ ప్రారంభం అవుతుందని అభిప్రాయపడింది. భవిష్యత్తు అంచనాను స్థిరంగా ఉంచింది. భారత వృద్ధి రేటు భయాలు పెరుగుతున్నప్పటికీ, ఇప్పుడు చేపట్టిన సంస్కరణలు మెరుగ్గా చేయగలిగితే వృద్ధి రేటు ఇతర దేశాల కంటే ముందుండే అవకాశముందని ఎస్ అండ్ పీ తెలిపింది. భారత రుణ సార్వభౌమ రేటింగ్‌ను ఇటీవల తగ్గించిన మూడీస్ కూడా వచ్చే ఏడాది పుంజుకుంటుందని పేర్కొంది. అన్ని రేటింగ్ ఏజెన్సీలు కూడా భారత భవిష్యత్తుపై ఆశాజనకంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications