COVID 19: 100ఏళ్లలో చూడలేని మాంద్యం, అదే జరిగితే భారత ఆర్థిక పరిస్థితి ఊహించడమే కష్టం
కరోనా మహమ్మారి రెండోసారి పుంజుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుందని, ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం ప్రతికూలత నమోదు చేయవచ్చునని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) తాజా నివేదికలో హెచ్చరించింది. లేదంటే మైనస్ 3.7 శాతం ఉండవచ్చునని అంచనా వేసింది. అంతకుముందు మార్చిలో జీడీపీ 5.1 శాతంగా ఉంటుందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 8.2 శాతం నుండి 8.9 శాతం మధ్య ఉండవచ్చునని పేర్కొంది. ఇక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 100 సంవత్సరాల కాలంలో కనీవినీ ఎరుగని తిరోగమనంలో పడిందని పేర్కొంది. రెండోసారి కరోనా విజృంభిస్తే ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదం అని తెలిపింది.

భారత్ కోలుకుంటున్నప్పటికీ...
కరోనా సంక్షోభం నుండి భారత్ కోలుకున్నప్పటికీ ఈ ప్రభావం కొంత అలాగే ఉంటుందని OECD తెలిపింది. లాక్ డౌన్ ఎత్తివేసినందున ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నాయని, కానీ ప్రభావం కొంతకాలం ఉంటుందని పేర్కొంది. కరోనా కంటే ముందు డిమాండ్‌కు చేరుకోవడానికి చాలా సమయం పడుతుందని వివిధ సంస్థలు వెల్లడించాయి. దేశీయంగా డిమాండ్ తగ్గి కొన్ని సంస్థలు ఆదాయాలు కోల్పోతాయని, ఉద్యోగాలు పోతాయని OECD తెలిపింది. అలాగే, కార్మికులు తిరిగి రావడం, కొన్ని బిజినెస్‌లు క్లోజ్ కావడం వల్ల సప్లై చైన్ దెబ్బతినడం, ఉద్యోగాలు పోవడం వంటి పరిస్థితులు ఉంటాయని తెలిపింది.

ఆ ఆర్థిక నష్టం ఊహించడం కష్టం
కరోనా దెబ్బకు ప్రపంచం ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని అభిప్రాయపడింది OECD. ఈ వైరస్ దారుణ అంతర్జాతీయ మాంద్యానికి దారితీసిందని, దాదాపు గత శతాబ్ద కాలంలో ఇలాంటి పరిస్థితిని చూడనేలేదని తెలిపింది. మళ్లీ అంటురోగాలు విజృంభించే ప్రమాదం ఉందని, ఇప్పుడే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, రెండో దశ విజృంభిస్తే నష్టాలను ఊహించడం కష్టమేనని అభిప్రాయపడింది.

కోట్లాదిమందిపై ప్రభావం
కరోనా వ్యాప్తి నిరోధానికి భారత్‌లో రెండు నెలలకు పైగా లాక్ డౌన్ కొనసాగింది. క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తోంది ప్రభుత్వం. ఈ సమయంలో కోట్లాది ఉద్యోగాలు పోయాయి. ముఖ్యంగా యువత, పేద ప్రజలను ఈ మహమ్మారి తీవ్రంగా ప్రభావితం చేసిందని OECD పేర్కొంది.

అంచనా కష్టమే కానీ
OECD ఏర్పాటయినప్పటి నుండి ఇలాంటి అనిశ్చితిని, వైపరిత్యాన్ని చూడలేదని ఆ సంస్థ సెక్రటరీ జనరల్ అన్నారు. ఎప్పటిలా ఇప్పుడు అంచనా వేసే పరిస్థితి లేదన్నారు. ఐనా కరోనా మళ్లీ విజృంభించకుంటే ప్రపంచ జీడీపీ ఈ ఏడాది మైనస్ ఆరు శాతంగా నమోదు కావొచ్చునని, వచ్చే ఏడాది 2.8 శాతంగా ఉండవచ్చునని తెలిపారు. మళ్లీ విజృంభిస్తే మాత్రం మైనస్ 7.6 శాతానికి పడిపోవచ్చునన్నారు. కరోనా ప్రభావం దీర్ఘకాలం ఉండే అవకాశాలు లేకపోలేదని ఆయన చెప్పారు. కరోనాను వీలైనంత త్వరగా అదుపు చేయకపోతే ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కష్టమన్నారు.


Click it and Unblock the Notifications