Demat Accounts: డీమ్యాట్ అకౌంట్స్ రికార్డు.. వామ్మో, ఆ దేశ జనాభా కంటే ఎక్కువ
Indian Demat Accounts: కరోనా తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల హడావిడి పెరుగుతోంది. దీంతో చాలా మంది కొత్త పెట్టుబడిదారులు మార్కెట్లలో ప్రత్యక్షమౌతున్నారు. ఇది సరికొత్త రికార్డులను ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తోంది.
డిపాజిటరీల తాజా గణాంకాల ప్రకారం భారతదేశం మొత్తంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఆగస్టులో తొలిసారిగా రికార్డు స్థాయి 17 కోట్ల మార్కును అందుకుంది. ఈ క్రమంలో ఆగస్టు నెలలో మెుత్తంగా 42.3 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరవబడ్డాయని వెల్లడైంది. దీంతో మెుత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 17.11 కోట్లకు చేరుకుంది. అయితే జూలై నెలలో 44.44 లక్షల డీమ్యాట్ ఖాతాలు తెరవబడ్డాయి. అయితే ఈ సంఖ్య ఆసక్తికరమైన రికార్డులను సృష్టిస్తోంది.

భారతదేశం మొత్తం డీమ్యాట్ ఖాతాలు ఇప్పుడు ర్యాంక్‌లో తొమ్మిదవ స్థానంలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలతో పోల్చితే మొత్తం డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య రష్యా, ఇథియోపియా, మెక్సికో, జపాన్ వంటి దేశాల జనాభాను మించిపోయింది. అలాగే ఈ సంఖ్య బంగ్లాదేశ్ జనాభాకు దగ్గరగా ఉంది. రెండు నెలల కిందట డీమ్యాట్ ఖాతాల సంఖ్య 16 కోట్ల మార్కుకు చేరుకున్న తర్వాత వేగంగా కోటి ఖాతాలు తెరవబడ్డాయి. అలాగే 2023 జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు కొత్తగా 6 కోట్ల డీమ్యాట్ ఖాతాలు తెరవబడ్డాయి. ఇది భారతీయ స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల వేగవంతమైన పెరుగుదలను ప్రధానంగా ప్రతిబింబిస్తోంది.
అలాగే 2024లో ఇప్పటివరకు గడచిన తొమ్మిది నెలల కాలంలో దాదాపు 3.18 కోట్ల కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరవబడ్డాయి. కానీ 2023 మెుత్తం సంవత్సర కాలంలో ఈ పెరుగుదల కేవలం 3.10 కోట్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా భారతీయ మార్కెట్లు పెరగడంతో పాటు వాటిలో భాగస్వామ్యం పెరగడం వల్ల చాలా మంది పెట్టుబడిదారులు, ట్రేడర్లు డీమ్యాట్ ఖాతాలను తెరవడానికి మొగ్గు చూపుతున్నారని విశ్లేషకుల్లోని ఒక విభాగం చెబుతోంది.
వేగంగా డిజిటల్ రూపంలో ఖాతాలు తెరిచేందుకు వెసులుబాటు అందుబాటులోకి రావటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ డీమ్యాట్ ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓవర్ వాల్యుయేషన్ పాకెట్స్ ఉన్నప్పటికీ, భారతీయ మార్కెట్లు స్థిరమైన వృద్ధిని కనబరిచాయని దేశీయ బ్రోకరేజ్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications