ఇండియన్ కాఫీ ఎగుమతిదారులు యూరోప్ ప్రాంతంలో తమ మార్కెట్‌ను కొంత భాగాన్ని బ్రెజిల్‌కు కోల్పోయినట్లుగా కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా ఆ దేశం ఎక్కువ పంట, తక్కువ ధరల ద్వారా మార్కెట్లోకి వెళ్తోంది. ఇటలీకి కాఫీ ఎగుమతులకు సంబంధించి బ్రెజిల్ తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. లిక్విడిటీ సమస్యలు, అధిక ధరల కారణంగా భారత్ నుండి ఎగుమతులపై ప్రభావం పడుతోంది. అదే సమయంలో కరోనా సమయంలో బ్రెజిల్ పెద్ద ఎత్తున ఎగుమతులు చేస్తోంది పైగా ఆ దేశం తన కరెన్సీ వ్యాల్యూని తగ్గించింది. ఇది కూడా ఎగుమతులకు ఉపయోగపడిందని చెబుతున్నారు.

బ్రెజిల్ అతిపెద్ద ఉత్పత్తిదారు
ప్రస్తుతం బ్రెజిల్‌కు ఇది పంట సీజన్. అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను ఉత్పత్తి ఎక్కువే ఉంటుంది. యూరోప్‌లో కరోనా ప్రభావంతో కొనుగోలుదారులు తక్కువ ధరకు వచ్చే వాటి కోసం చూస్తున్నారు. బ్రెజిల్ దీనిని సొమ్ము చేసుకుంది. ధరల తగ్గుదలకు తోడు వివిధ కారణాలతో అక్కడి డిమాండ్‌ను ఇండియన్ ఎక్స్‌పోర్టర్స్ తీర్చలేకపోయారని చెబుతున్నారు. గత ఏడాది మాదిరి కాఫీ గింజల కోసం ఈసారి కొరత లేదని, అరబికా రకం ఉత్పత్తి అంచనాలకు తగినట్లుగా లేనప్పటికీ, రొబుస్తా గింజలు బాగుందంటున్నారు.

లాక్ డౌన్ ప్రభావం
మార్చి 25వ తేదీన లాక్ డౌన్ ప్రారంభమైందని, అంతకుముందు తమ కాఫీ స్టాక్స్ విక్రయించలేకపోయిన వారు, ఆ తర్వాత ఎగుమతుల లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చునని చెబుతున్నారు. మన దేశంలో ఎక్కువ కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక. కరోనా కారణంగా అక్కడ రూ.441 కోట్ల పంట నష్టం జరిగి ఉంటుందని అసోసియేషన్ భావిస్తోంది. అదనంగా ఎగుమతుల రూపంలో నష్టం రూ.200 కోట్ల నుండి రూ.250 కోట్లకు వరకు ఉంటుందని చెబుతున్నారు.

భారీగా పడిపోయిన ఎగుమతులు
కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా జనవరి 1వ తేదీ నుండి జూన్ 23వ తేదీ వరకు ఇండియా కాఫీ ఎగుమతులు 17 శాతం తగ్గి 167,445 టన్నులకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రోబుస్తా రకం 26 శాతం తగ్గిందట. కేరళలో వాయనాడ్ కాఫీ ఉత్పత్తికి ఫేమస్. కాఫీ డిమాండ్ తగ్గడంతో ధరలు కూడా తగ్గిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ధరలు 54 కిలోల బ్యాగ్‌కు 6 శాతం తగ్గి రూ.3,800కు చేరుకున్నాయి. ఇది కాఫీ సాగుదారులకు నష్టం కలిగిస్తుంది. కాగా, కాఫీ ఎగుమతులపై ఉన్న 3 శాతం ప్రోత్సాహకాన్ని 5 శాతానికి పెంచాలని కోరుతున్నాయి.


Click it and Unblock the Notifications