India-US trade deal: భారత్- అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఇంకా కొలిక్కి రావడం లేదు. తాజాగా మరోసారి చర్చల కోసం భారత బృందం అమెరికా చేరుకుంది. తాజా చర్చల కోసం భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుండి సీనియర్ బృందం వాషింగ్టన్ డిసిలో అడుగుపెట్టింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక సుంకాల గడువు ఆగస్టు 1, 2025 నుండి అమల్లోకి రానుండటంతో భారత ప్రభుత్వం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తోంది. వ్యవసాయంతో పాటుగా ఆటోమొబైల్ రంగాల్లో ఉన్న విభేదాలను పరిష్కరించడానికి రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
అయితే చర్చలు కొనసాగుతున్న వేళ అమెరికా విధించబోయే సుంకాలతో భారతీయ పాడి పరిశ్రమకు పెను ముప్పు ఎదురుకానునట్లుగా వార్తలు వస్తున్నాయి. పాడి రంగంలో అమెరికన్ దిగుమతులను ఆహ్వానిస్తే..దేశీయ రైతులకు సంవత్సరానికి దాదాపు రూ.1.03 లక్షల కోట్ల నష్టం వాటిల్లవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజా విశ్లేషణ హెచ్చరించింది. ప్రపంచంలోనే భారతదేశం పాడి పరిశ్రమ అగ్రస్థానంలో దూసుకుపోతోంది.ఈ రంగం దేశంలో సుమారు 8 కోట్ల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తోంది. దేశం మొత్తం స్థూల విలువ ఆధారిత ఉత్పత్తిలో (GVA) ఈ రంగం 2.5% నుంచి 3 శాతం వాటా కలిగి ఉంది. ఇది సుమారుగా రూ. 7.5-9 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు.

అమెరికా పాడి పరిశ్రమకు భారీ సబ్సిడీలతో పాటుగా తక్కువ ఉత్పత్తి ఖర్చులు ఉండటం వల్ల ఆ దేశ పాల ఉత్పత్తులు భారతీయ మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించే అవకాశం ఉందని SBI విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఉత్పత్తులు భారత్ ను తాకితే.. పాల ధరలు 15 శాతం వరకూ తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో చిన్న తరహా రైతుల ఆదాయం కోల్పోయి తీవ్ర నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తుల వల్ల కోట్లలో నష్టం వచ్చే అవకాశం ఉంది.
కాగా ఇప్పటికే భారత పాడి పరిశ్రమపై అగ్రరాజ్యం అమెరికా నుండి దిగుమతుల ఒత్తిడి పెరుగుతోంది.ఇదే జరిగితే భారత రైతులకు భారీ నష్టం కలిగించే ప్రమాదముందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. మోదీ సర్కారు పాడి పరిశ్రమను అమెరికన్ దిగుమతులకు తెరిచే ముందు రైతుల ఆదాయం, దేశీయ ఉపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఎంత మేర ప్రభావం పడుతుందో పరిశీలించడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరంగం మీద కాకుండా ఇతర రంగాల్లో అమెరికా దిగుమతులను పరిశీలించాలని సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇప్పటికే 20కి పైగా దేశాలపై అధిక టారిఫ్‌లు విధించనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు భారతదేశానికి అలాంటి లేఖ రాలేదని సమాచారం. ఈ పరిస్థితులు ఇలా ఉంటే అమెరికా వస్తువులపై నేటి నుంచి అమల్లోకి రానున్న ప్రతీకార సుంకాలను యూరోపియన్ యూనియన్(ఈయూ) నిలిపివేసింది. ఆగస్టు ఒకటి నుంచి ఈయూ, మెక్సికోపై 30% కొత్త సుంకాలను ట్రంప్ ప్రకటించడంతో ఈయూ వెనుకడుగు వేసింది.


Click it and Unblock the Notifications