India-US trade deal : భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు. భారత్‌పై 25శాతం సుంకాలే కాదు అదనంగా పెనాల్టీ విధించినట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఈ సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. భారతదేశాన్ని మిత్ర దేశమని పేర్కొన్న ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక దిగుమతి సుంకాలు విధిస్తున్న దేశాల్లో ఒకటిగా ఉన్నదని, అంతేకాకుండా కఠినమైన వాణిజ్య అడ్డంకులతో అమెరికా ఉత్పత్తులపై పరిమితులు విధిస్తోందని అన్నారు.
రష్యాతో కొనసాగుతున్న ఇంధన, ఆయుధ వాణిజ్యంపై గుర్రుగా ఉన్న ట్రంప్..ఈ సుంకాల బాంబు పేల్చారు. దీంతో పాటుగా రష్యా నుండి కొనుగోలు చేసిన ఇంధనం, ఆయుధాలపై అదనపు జరిమానాలు కూడా విధించనున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. భారతదేశం మన మిత్ర దేశమే అయినా, వారు ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో ఒకటిగా ఉంది. వారు వాణిజ్య అడ్డంకులతో అమెరికా ఉత్పత్తులకు అనుకూలంగా లేరు. దీన్ని ఇక చాలించాలి అని రాసుకొచ్చారు.

కాగా భారత్ ఎక్కువ శాతం సైనిక సామగ్రిని రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది. చైనా తర్వాత రష్యాకు అతిపెద్ద ఖరీదైన వినియోగదారుడిగా భారత్ ఉంది. ఇదంతా ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న సమయంలోనే జరుగుతోంది. ఇది క్షమించదగిన విషయం కాదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక ట్రంప్ గతంలో ఏప్రిల్ 2న 'లిబరేషన్ డే' సమావేశంలో 26 శాతం సుంకాన్ని సూచించినప్పటికీ, ఇప్పుడు భారతదేశానికి 25 శాతానికే పరిమితం చేశాడు. అయినా ఇది తాత్కాలిక రాయితీ మాత్రమే అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అతను ఇదే పోస్ట్‌లో గడువు ఆగస్టు 1 గడువును కూడా ప్రస్తావించారు.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం నిరవధికంగా నిలిచిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల అమెరికా పర్యటనలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపినప్పటికీ సత్ఫలితాలు ఇవ్వలేదు. ఐదు రౌండ్ల చర్చల తర్వాత కూడా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరలేదు . ఈ నేపథ్యంలో ఆరవ రౌండ్ చర్చలు ఆగస్టు చివరిలో భారత్‌లో జరగనున్నట్లుగా తెలుస్తోంది.
అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషకుల ప్రకారం.. ఈ సుంకాలు తాత్కాలికంగా అమలులోకి వస్తాయని భారత ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సెప్టెంబర్ నాటికి ఒప్పందం ఖరారైతే, ఈ సుంకాలను అమెరికా వెనక్కి తీసుకునే అవకాశముంది. అమెరికా తన ఉత్పత్తులకు భారతదేశ మార్కెట్లో తలుపులు తెరవాలని కోరుకుంటోంది.ముఖ్యంగా పాడి పంటల ఉత్పత్తులను భారత్ లోకి తీసుకురావాలని గట్టిగా పట్టుబడుతోంది. అయితే వ్యవసాయం, పాడి రంగాల విషయంలో భారత్ ఈ అంశాలను స్పష్టంగా తిరస్కరిస్తోంది. ఈ అంశాలే వాణిజ్య చర్చలకు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి.


Click it and Unblock the Notifications