India-US Trade Deal Countdown: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన సుంకాల వ్యవహారం మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం, డొనాల్డ్ ట్రంప్ అందించిన 90 రోజుల మినహాయింపు జూలై 9తో ముగియనుండటంతో.. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆసక్తికర పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలో, భారత్-అమెరికా మధ్య చిన్నపాటి వాణిజ్య ఒప్పందం కుదరబోతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
అయితే ఇది అంత సులభం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. భారత మార్కెట్ లో వ్యవసాయం, పాల ఉత్పత్తుల రంగంలో తమ ఉత్పత్తులను తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఈ ఉత్పత్తులపై దిగుమతులపై విధిస్తున్న సుంకాలను తగ్గించమని భారత్‌పై ఒత్తిడి తెస్తోంది.కానీ భారతదేశం దీనికి ససేమిరా అంటోంది. తమ రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నందున.. ఆ డిమాండ్లను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది.అమెరికా ప్రధానంగా గోధుమ, బియ్యం, పాల ఉత్పత్తులు, సోయా, పిస్తా, బాదం వంటి ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరుతోంది.
అమెరికన్ కంపెనీలు అమెజాన్, వాల్‌మార్ట్ వంటి సంస్థలు నేరుగా భారత మార్కెట్లోకి ప్రవేశించి తమ ఉత్పత్తులను సులభంగా విక్రయించేందుకు ఇది సహాయపడుతుంది.అయితే ఈ ఉత్పత్తుల చౌక ధరలకు అందిస్తే భారతదేశ రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని అమెరికాకు మోదీ సర్కారు స్పష్టం చేసింది.

దేశ ప్రయోజనాలకే మా మొదటి ప్రాధాన్యత ఇస్తామని భారత్ ఖరాఖండిగా తెలిపింది. దేశంలో వ్యవసాయ, పాడి పరిశ్రమలను బలహీనపరిచే ఏ ఒప్పందానికీ భారత్ సిద్ధంగా లేదు. ప్రస్తుతం దఏశంలో వ్యవసాయ రంగంలో వేలాది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. చౌకగా వచ్చే దిగుమతుల వల్ల స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఉత్పత్తుల ధరలు పడిపోతాయి, రైతుల ఆదాయానికి గండిపడుతుందని భారత్ వాదిస్తోంది.
అమెరికా నుంచి దిగుమతయ్యే పాల ఉత్పత్తులు, గోధుమలు, బియ్యం భారత మార్కెట్‌లోకి వస్తే, దేశీయ ఉత్పత్తిదారులు వాటితో పోటీలో నిలబడలేరు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుంది. ప్రపంచ ధరల మార్పిడికి రైతులు తట్టుకోలేరు. ఇలాంటి నిర్ణయాలు భారత ఆహార భద్రతను కూడా హానిచేస్తాయి. ఇప్పటికే యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాల్లో కూడా భారత్ తన పాడి పరిశ్రమను తెరవడం లేదు. ఇదే తరహా సూత్రాన్ని అమెరికాతో కూడా అనుసరిస్తోంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి కేంద్ర మంత్రులు దీనిపై భారత్ స్పష్టమైన వైఖరిని అమెరికాకు వెల్లడించారు.గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ ప్రకారం, అమెరికన్ పాల ఉత్పత్తులు, గోధుమలు దిగుమతికి అనుమతి ఇవ్వడం వల్ల భారత ఆహార భద్రత బలహీనపడుతుంది. దేశీయ రైతులు చౌక, సబ్సిడీ ఉత్పత్తులతో పోటీ పడలేరు. దీనితో పాటు, అంతర్జాతీయ ధరల అస్థిరత రైతులపై మరింత ఒత్తిడిని కలిగిస్తుందన్నారు.
ఏప్రిల్ 2న అమెరికా భారతీయ వస్తువులపై 26 శాతం పరస్పర సుంకాన్ని విధించింది. అయితే దాని అమలును తాత్కాలికంగా 90 రోజుల పాటు నిలిపివేసింది. జూలై 9 నాటికి ఎటువంటి ఒప్పందం కుదరని పక్షంలో ఈ అధిక సుంకాలు అమల్లోకి రావచ్చు. ఈ 26 శాతం సుంకం నుండి పూర్తి మినహాయింపు కోసం భారత్ ప్రయత్నిస్తోంది.ఇక అమెరికా 10 శాతం బేస్‌లైన్ సుంకం ఇప్పటికీ అమలులో ఉంది.
భారతదేశం దుస్తులు, వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు, ప్లాస్టిక్‌లు, రసాయనాలు, రొయ్యలు, ఉద్యానవన ఉత్పత్తుల ఎగుమతులపై సుంకాలను తగ్గించాలని అమెరికాను డిమాండ్ చేస్తోంది.అలాగే ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్ పై అమెరికా విధిస్తున్న 25 శాతం, 50 శాతం సుంకాలను తగ్గించాలని కూడా భారతదేశం ఒత్తిడి చేస్తోంది.
భారత్-అమెరికా మధ్య బలమైన వాణిజ్య సంబంధం ఉంది. 2024-25లో ఇరుదేశాల మధ్య 131.84 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో 41.18 బిలియన్ డాలర్ల మిగులును భారత్ అందుకుంది.ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే నెలల్లో17.25 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యాయి. దాదాపు 22 శాతం పెరుగుదల నమోదైంది. ఇక దిగుమతులు కూడా 25 శాతం పైగా పెరిగి 8.87 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.ఇతర రంగాల్లో కూడా అమెరికా భారీగా పెట్టుబడులు పెట్టింది. ఐటీతో పాటు ఇతర రంగాల్లో 70 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది అగ్రరాజ్యం. ఏప్రిల్ 2000- మార్చి 2025 మధ్య కాలంలో ఈ పెట్టుబడులు వచ్చాయి.
ఏదేమైనా.. భారతదేశం రైతుల ప్రయోజనాల కోసం పోరాడుతోంది. వాణిజ్య ఒప్పందం కుదిరినా కుదరకపోయినా, దేశ రైతుల భద్రతే అత్యంత ప్రాధాన్యత. ప్రస్తుతం భారత్ తన వైఖరిని స్పష్టంగా తెలిపిన నేపథ్యంలో, తదుపరి చర్య అమెరికా తీసుకోవలసిన పని. ఒప్పందం జరగాలంటే, భారత్ రైతుల ప్రయోజనాలకు హాని చేయకుండా ఒప్పందం కుదుర్చుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంపై ఉంది.


Click it and Unblock the Notifications