రెండ్రోజుల్లో భారత్-అమెరికా వాణిజ్య చర్చలు! ఇందులో చర్చించే అంశాలివేనా?
India US Trade Deal: ప్రపంచంలోని అతిపెద్ద రెండు ప్రజాస్వామ్య దేశాలైన భారత్ (India), అమెరికా (US) మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bilateral Trade Agreement) తొలి దశపై చర్చలు ఈ నెల 10వ తేదీ నుంచి న్యూఢిల్లీలో మూడు రోజుల పాటు ప్రారంభం కానున్నాయి.

ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్యం 191 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సంఖ్యను 2030 నాటికి 500 బిలియన్లకు పెంచాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ చర్చలు విజయవంతమైతే, ముఖ్యంగా భారత ఎగుమతిదారులకు (Indian Exporters) పెద్ద ఊరట లభించనుంది.
ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?
డిసెంబర్ 10 నుంచి 12 వరకు జరిగే ఈ అనధికారిక చర్చలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి భాగాన్ని ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. యుఎస్ తరఫూన డిప్యూటీ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) రిక్ స్విట్జర్ నేతృత్వంలోని బృందం చర్చల్లో పాల్గొననుంది. మన వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ దర్పణ్ జైన్.. భారత బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.
అమెరికా అధికారులు భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు నేపథ్యంలో భారత వస్తువులపై అమెరికా 25% వరకు సుంకాలు విధించిన తర్వాత ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
టారిఫ్ సమస్యపై ప్రత్యేక దృష్టి
భారత ఎగుమతిదారులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పరస్పర సుంకాలు. భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఇటీవల మాట్లాడుతూ.. ఈ ఏడాదిలోనే అమెరికాతో ఒక ఫ్రేమ్‌వర్క్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ ఆశాభావంతో ఉందని, దీని ద్వారా భారత ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరేలా సుంకాల అంశాన్ని పరిష్కరించవచ్చని తెలిపారు.
ఈ చర్చల్లో భారత్, అమెరికాలు రెండు రకాల చర్చలు జరుపుతున్నాయి. సుంకాల సమస్యను పరిష్కరించేందుకు ఒక ఫ్రేమ్‌వర్క్ వాణిజ్య ఒప్పందంపై చర్చ. అలాగే ఒక సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై చర్చ.
ఎగుమతులపై సుంకాల ప్రభావం
అమెరికా, భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. 2024-25లో రెండు దేశాల మధ్య వాణిజ్య విలువ 131.84 బిలియన్ డాలర్లు. భారతదేశ మొత్తం వస్తువుల ఎగుమతుల్లో దాదాపు 18 శాతం అమెరికాకే జరుగుతున్నాయి. అయితే అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా భారత ఎగుమతులు అక్టోబర్‌లో 8.58 శాతం తగ్గి 6.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అందుకే ఈ వాణిజ్య ఒప్పందం త్వరగా కుదరడం భారతీయ ఎగుమతిదారులకు అత్యంత ముఖ్యం.
ఈ వాణిజ్య చర్చలు సుంకాలపై స్పష్టమైన పరిష్కారాన్ని అందించి.. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం సుగమం చేస్తాయని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications