Trade Deficit: మార్చి 15న విడుదలైన వివరాల ప్రకారం ఫిబ్రవరి 2023లో భారతదేశ వాణిజ్య లోటు 17.43 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది క్రితం సంవత్సరంలో నమోదైన 18.75 బిలియన్ డాలర్లతో పోలిస్తే తక్కువని చెప్పుకోవాలి. జనవరి 2023లో వాణిజ్య లోటు 17.76 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఫిబ్రవరిలో మొత్తం దిగుమతుల విలువ 51.31 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఏడాది కిందట ఇదే కాలంలో వీటి విలువ 55.90 బిలియన్ డాలర్లతో పోలిస్తే 8 శాతం తక్కువగా ఉన్నాయి. జనవరిలో దిగుమతులు 50.66 బిలియన్ డాలర్లుగా ఉన్నందున నెలవారీ ప్రాతిపధికన దిగుమతులు పెరిగాయి.

ఇదే క్రమంలో భారత్ సరుకు ఎగుమతులు ఫిబ్రవరిలో 8.8 శాతం తగ్గి 33.88 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది క్రితం ఏడాది కాలంలోని 32.91 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అయితే గత నెలలో ఎగుమతుల విలువ 37.15 బిలియన్ డాలర్లుగా ఉంది.
సర్వీస్ సెక్టార్ ఎగుమతులు సంవత్సరానికి దాదాపు 37 శాతం పెరిగి 36.85 బిలియన్ డాలర్లకు చేరుకోగా.. దిగుమతులు 12 శాతం పెరిగి 14.55 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫిబ్రవరిలో సర్వీస్ సెక్టార్, సరుకుల ఎగుమతులు కలిపి 7.8 శాతం పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయం ద్వారా ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి నమోదైందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

2023 ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఎగుమతులు 50 శాతం పెరిగాయని, జనవరి చివరి నాటికి ఇది 8.3 బిలియన్ డాలర్లకు చేరుకుందని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలిపారు. ఈ క్రమంలో ఎగుమతులను 750 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా భారత్ పెట్టుకుంది.


Click it and Unblock the Notifications