జాతీయ రహదారులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్న కేంద్రం.. రూ. 35 వేల కోట్లు సమీకరించేలా మెగా ప్లాన్..
భారత ప్రభుత్వం దేశీయంగా మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను సమీకరించుకోవడానికి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరంలో (FY27) సుమారు 1,800 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 28 జాతీయ రహదారుల ఆస్తులను ద్రవ్యీకరణ (అసెట్ మోనిటైజేషన్) చేయడం ద్వారా దాదాపు 35 వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వం నేరుగా రోడ్లను విక్రయించకుండా, వాటి నిర్వహణ, టోల్ వసూలు చేసుకునే హక్కులను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వడం ద్వారా ఈ ప్రక్రియను చేపడుతుంది. ఇలా సేకరించిన నిధులను దేశంలో కొత్త హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు,వంతెనల నిర్మాణానికి తిరిగి పెట్టుబడిగా మళ్లించనున్నారు.

ఈ భారీ ద్రవ్యీకరణ బాధ్యతలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పర్యవేక్షిస్తోంది. నిధుల సేకరణ కోసం హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న రహదారులను గుర్తించారు. ఈ ఆస్తుల ద్రవ్యీకరణను పబ్లిక్, ప్రైవేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు (InvIT), టోల్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (TOT) నమూనాల కలయిక ద్వారా నిర్వహించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ద్రవ్యీకరణ ప్రణాళికలో రెండు బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (BOT) ప్రాజెక్టులతో పాటు ఏడు ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (EPC) ప్రాజెక్టులు కూడా భాగస్వామ్యం కానున్నాయి.
అయితే ఇతర ప్రాజెక్ట్ నమూనాలతో పోలిస్తే మూలధన వ్యయం ముప్పు చాలా తక్కువగా ఉండే హైబ్రిడ్ యాన్యుయిటీ మోడల్ (HAM) ఆస్తుల ద్రవ్యీకరణకే ప్రభుత్వం ఎక్కువ మొగ్గు చూపుతోందని ఉన్నతాధికారులు వెల్లడించారు. సార్వభౌమ సంపద నిధులు (Sovereign Wealth Funds), పించను నిధులు (Pension Funds) వంటి పెద్ద అంతర్జాతీయ సంస్థలు నేరుగా గ్రీన్‌ఫీల్డ్ టోల్ రోడ్ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతించిన నేపథ్యంలో ఈ తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనివల్ల రవాణా రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు.
గత 2025-26 ఆర్థిక సంవత్సరంలో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ద్వారా ఆస్తుల ద్రవ్యీకరణ రూపంలో దాదాపు 29 వేల కోట్ల రూపాయల ఆదాయం లభించింది. అలాగే NHAI చేపట్టిన మొట్టమొదటి పబ్లిక్ ఇన్విట్ (InvIT) ద్వారా నాలుగు రాష్ట్రాల్లోని 260 కిలోమీటర్ల మేర విస్తరించిన ఐదు రహదారుల సెక్షన్లను ద్రవ్యీకరించి విజయవంతంగా 9 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను సేకరించారు. రాబోయే మూడు నుంచి ఐదేళ్ల కాలంలో మరో 1,500 కిలోమీటర్ల మేర పూర్తయిన, ఆదాయాన్ని తెచ్చిపెట్టే జాతీయ రహదారులను ఈ పబ్లిక్ ఇన్విట్ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. దీనివల్ల పాత ఆస్తులను సమర్థవంతంగా పునరుద్ధరించుకుంటూ, కొత్త రోడ్ల అభివృద్ధికి నిరంతరాయంగా ఆదాయ వనరులను సృష్టించుకోవడానికి వీలవుతుంది.
ఫిబ్రవరిలో ప్రకటించిన 'నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్ (NMP) 2.0' మార్గదర్శకాల ప్రకారం, 2025-26 నుండి 2029-30 వరకు ఐదేళ్ల కాలానికి గాను ఒక్క హైవే రంగానికి సంబంధించిన మొత్తం ద్రవ్యీకరణ విలువను సుమారు 4.42 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. అందులోనూ కేవలం 2026-27 ఆర్థిక సంవత్సరంలోనే ఈ రంగం నుండి దాదాపు 68,770 కోట్ల రూపాయల వరకు ఆదాయం లభిస్తుందని ముందస్తు అంచనాలు వెల్లడించాయి.
గతంలో అమలు చేసిన ఎన్‌ఎమ్‌పి మొదటి విడతతో పోలిస్తే, ఈ విడతలో ప్రధాన మార్పు ఏమిటంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బిడ్డింగ్ పూర్తి చేసుకున్న బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (BOT) ప్రాజెక్టులను సైతం ద్రవ్యీకరణ జాబితాలో చేర్చడం విశేషం. ఈ సమగ్ర వ్యూహం ద్వారా మౌలిక సదుపాయాల విలువను వెలికితీస్తూ, ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడకుండా సరికొత్త ప్రగతి వైపు దేశాన్ని నడిపించాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది.


Click it and Unblock the Notifications
